పరీక్ష కేంద్రాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాల తనిఖీ

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

● యూపీఎస్‌సీ పరీక్షలు రేపు

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో జరుగుతున్న ఎల్‌ఎల్‌బీ మొదటి, ఐదో సెమిస్టర్‌ పరీక్షల తీరును రెక్టార్‌ అప్పారావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంజిమేడులోని ఈశ్వరరెడ్డి లా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరు, పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను వర్సిటీ సిటింగ్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ శ్రీనివాస నాయక్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, సమయపాలన పాటిస్తూ మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపల్‌, సిబ్బందికి సూచించారు.

హాకీ జూనియర్‌ మహిళల జిల్లాజట్టు ఎంపిక రేపు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఎస్వీ యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఈ నెల 12వ తేదీ ఉదయం హాకీ జూనియర్‌ మహిళల జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి బి.ఆదిత్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలకు 2007 జనవరి ఒకటో తేదీ తరువాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే క్రీడాకారిణులు ఒరిజినల్‌ ఆధార్‌కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌, పదో తరగతి మార్క్స్‌ కార్డుతో ఆదివారం ఉదయం 7 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఎంపికై నా జిల్లా జట్టు ఈ నెల 16నుంచి 18వ తేదీ వరకు చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌ షిప్‌లో పాల్గొంటుందని ఆయన తెలిపారు.

పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

తిరుపతి అర్బన్‌: యూపీఎస్‌సీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టామని జిల్లా రెవెన్యూ అధి కారి నరసింహులు వెల్లడించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై స్టేట్‌ అబ్జర్వర్‌ జితేంద్రకుమార్‌, లైజనింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఆదివారం యూపీఎస్‌సీ సంయుక్త రక్షణ సేవల పరీక్ష, జాతీయ రక్షణ అకాడమీ అండ్‌ నావల్‌ అకాడమీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో 1,535 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేదని చెప్పారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం బస్టాండ్‌ నుంచి పరీక్ష కేంద్రానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీపద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల వింగ్‌–ఏ, వింగ్‌–బీ సెంటర్లతోపాటు ఎస్వీ ఆర్ట్‌ కళాశాల(టీటీడీ) బాలాజీ కాలనీలోని వింగ్‌–ఏ వింగ్‌–బీ సెంటర్లలో పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.

సీనియారిటీ జాబితా విడుదల

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో రాజేంద్రప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ఎస్‌జీటీ కేడర్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా ఉద్యోగోన్నతులు కల్పించే ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన టీచర్ల ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాను www.chittoordeo.com వెబ్‌సైట్‌లో పొందుపరిచారన్నారు. ఈ జాబితాను ఆయా మండలాల ఎంఈవో, డీవైఈవో మెయిల్స్‌కు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఏవైనా అభ్యంతరాలున్నట్‌లైతే ఈ నెల 11 నుంచి 16వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో సరైన ఆధారాలతో అందజేయాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించేది లేదని డీఈఓ స్పష్టం చేశారు.

25 నుంచి పీజీ పరీక్షలు

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈనెల 25వ తేదీ నుంచి పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డా క్టర్‌ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ, ఎమ్‌ఎస్‌ డేటాసైన్స్‌, ఎంఈడీ, ఎమ్‌ఎల్‌ఐఎస్సీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు నాలుగో సెమిస్టర్‌ పరీక్షల కోసం ఈనెల 13వ తేదీలోపు ఫీజులు చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement