తిరుపతి సిటీ: ఎస్వీయూ మహిళా వసతి గృహాల్లో గ్యాస్ కొరత సాకు చూపుతూ మెనూ రద్దు చేయడం దారుణమని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వర్సిటీ మహిళా హాస్టల్–2 వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్సిటీలో అధికారుల తీరు దారుణంగా ఉందని, పురుషుల హాస్టల్లో లేని గ్యాస్ కొరత మహిళల హాస్టల్‌లో ఉందని చూపుతూ మెనూ రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. మెనూలో ఉన్న ఐటమ్స్‌ను వడ్డించంకుండా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, భోజనం సైతం నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఈడీ చదువుతున్న విద్యార్థినులు ప్రాక్టిక ల్స్‌లో భాగంగా ఉద యం క్లాసుకు వెళ్లాల్సి ఉండడంతో వారికి సమయానికి భోజనం అందించకపోవడంతో విద్యార్థినులు ఖాళీ కడుపుతో వెళుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో సమస్యలు, హాస్టల్ ఉద్యోగుల దురుసు ప్రవర్తనపై వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావును విద్యార్థులు నిలదీశారు. సోమవారం నుంచి పాత మెనూను కొనసాగిస్తామని, హాస్టల్‌లో సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు విద్యార్థులకు నచ్చచెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్సిటీల కో కన్వీనర్ వెంకటలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు పవిత్ర, ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, యూనివర్సిటీ కార్యదర్శి అనిత, నాయకులు శ్రవంతి, నవ్య పాల్గొన్నారు.


