సూళ్లూరుపేట : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)కు అకాడమిక్ ఆడిట్‌లో ‘ఏ’ గ్రేడ్ సర్టిఫికెట్ లభించింది. వార్షిక ఆడిట్‌లో భాగంగా గురు, శుక్రవారాల్లో ఆకాడమిక్ అడ్వయిజర్లు డాక్టర్ శ్రీరంజని, డాక్టర్ సీహెచ్ కృష్ణమూర్తి, ఎస్‌కే తమన్నా కళాశాలను సదర్శించి బోధనా విధానం, విద్యాపరమైన కార్యక్రమాలు, కళాశాలలోని రికార్డులు, ఆవరణలో వనరులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఏ గ్రేడ్‌కు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌ఎల్‌వీ శంకరశర్మ మాట్లాడుతూ ఈ విజయానికి అధ్యాపకులు, అధ్యాపకేత సిబ్బంది సమష్టి కృషే కారణమన్నారు.
గాయపడిన యువకుడి మృతి
చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి పంచాయతీ ఇందిరమ్మ కాలనీకు చెందిన నవీన్ కుమార్(25) గురువారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై మల్లయ్యపల్లి మార్గం నుంచి చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ వైపుగా వెళుతుండగా మరో ద్విచక్ర వాహనం చంద్రగిరి నుంచి వస్తూ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవీన్ కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ కుమార్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెలుగు వీఏఓపై దాడి
దొరవారిసత్రం: కొన్ని రోజుల నుంచి కొడుకు చేసే నిర్వాకం అతని భార్య, తల్లిదండ్రులకు చెబుతున్న నేపథ్యంలో తండ్రీకుమారులు వీఓఏ బద్దేలి సునీతను కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ ఘటన దొరవారిసత్రం మండలం నెల్లూరుపల్లిలో మూడు రోజుల కిందట చోటు చేసుకోగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు కథనం మేరకు.. నాయుడుపేట మండలం రామారెడ్డికండ్రిగకు చెందిన సునీత వెలుగులో వీఓఏగా కొన్నేళ్ల నుంచి పని చేస్తోంది. ఈమె కొంత కాలంగా నాయుడుపేటలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో దొరవారి సత్రం మండల నెల్లూరుపల్లి గ్రామానికి చెందిన వంకా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వీఓఏ వద్ద అసభ్యకరంగా ప్రవర్తించడం తన కోరిక తీర్చాలంటూ ఇబ్బందులు పెడుతూ వచ్చాడు. విసిగిపోయిన ఆమె మూడు రోజుల కిందట నెల్లూరుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి అతని భార్య కవితతో పాటు తల్లిదండ్రులు రమణయ్య, వెంకమ్మకు ఈ విషయం చెబుతున్న సమయంలో ఆవేశానికి లోనైన వెంకటేశ్వర్లు వీఓఏను కులం పేరుతో దూషించి దాడికి దిగాడు. ఇదే క్రమంలో అతడి తండ్రి కూడా నోటికి వచ్చినట్లు దూషించి, ఆమైపె దాడి చేశాడు. కాగా తాను ఇంటి వద్ద ఉండగా సునీత వచ్చి గొడవ చేసినట్లు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాల ఫిర్యాదులపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు.
గల్లంతైన వ్యక్తి మృతదేహం గుర్తింపు
కలువాయి(సైదాపురం): గేదెలు వెతకడానికి వెళ్లి కండలేరు వాగులో గురువారం గల్లంతైన కలువాయి మండలం పెరమకొండ గ్రామానికి చెందిన బక్కమంతల వివేక్ (35) శుక్రవారం మృతదేహమై కనిపించాడు. వివేక్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వివేక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
తప్పిపోయిన తల్లిని
కుమారుడికి అప్పగింత
సూళ్లూరుపేట: తప్పిపోయిన తల్లిని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఆమె కుమారుడికి శుక్రవారం అప్పగించారు. బతుకు తెరువు కోసం ఒడిశా నుంచి త్రిపుర సాహూ, భరత్‌సాహూ కుటుంబం పనుల కోసం తమిళనాడులోని కవర్‌పేట్‌కు వచ్చింది. ఈ క్రమంలో గురువారం త్రిపుర సాహూ తల్లి తప్పి పోయి, సూళ్లూరుపేటకు వచ్చింది. ఆమెకు భాష రాక ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని చూసి పోలీసులు ఆమెను విచారించారు. మాంబట్టు దాల్మియా కంపెనీ జీఎం మదన్‌మాలిక్ సహకారం తీసుకుని ఆమెతో మాట్లాడి తమిళనాడులోని కవర్‌పేట్‌లో ఇటుకల బట్టీలో పనిచేస్తున్న ఆమె కుమారుడి వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు.


