మా ఊరిని వల్లకాడు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

మా ఊరిని వల్లకాడు చేయొద్దు

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

● మైనింగ్‌ పరిశ్రమకు అనుమతులు మంజూరు చేయవద్దు ● అనుమతులు మంజూరు చేయండి ● రెండు గ్రామాల ప్రజల మధ్య ఉద్రిక్తత ● ప్రజాభిప్రాయసేకరణలో విభిన్న స్వరం

సైదాపురం: మైనింగ్‌ పరిశ్రమకు అనుమతులు మంజూరు చేస్తే తమ ఊరు వల్లకాడు అయి పోతుంది.. ఎట్టి పరిస్థితిలో అనుమతులు మంజూరు చేయకండి.. అంటూ ఓ గ్రామస్తులంతా వేడుకున్నారు. మైనింగ్‌కు అనుమతులు మంజూరు చేయాలని మరో గ్రామస్తులు చెప్పారు. ఇలా రెండు గ్రామాల ప్రజల మధ్య ప్రజాభిప్రాయ సేకరణలో విభిన్న స్వరం విన్పించడంతో సమావేశంలో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. ఈసంఘటన సైదాపురం మండలంలోని తుమ్మలతలుపూరు మైకామైన్‌ పాఠశాల ఆవరణలో శుక్రవారం జరిగిన పర్యావరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో చోటు చేసుకుంది. మండలంలోని తుమ్మలతలుపూరు సీవీసీ మైనింగ్‌ కంపెనీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పర్యావరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ తుమ్మలతలుపూరు రెవెన్యూ పరిఽధిలోని సర్వే 101పీలో 10.117 హెక్టార్లులో మైనింగ్‌ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యావరణ అనుమతి కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

చెర్లోపల్లి వాసుల ఆందోళన

మైనింగ్‌ అనుమతులకు వ్యతిరేకంగా చెర్లోపల్లి వాసులు ఆందోళన చేశారు. చెరువులో మైనింగ్‌ ఏర్పాటుకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. చెర్లోపల్లి వాసులతోపాటు నాలుగు కాలనీలకు చెందిన జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమకు జరిగే నష్టాలపై గళం వినిపించారు. ఎట్టి పరిస్థితిలో మైనింగ్‌ అనుమతులు మంజూరు చేస్తే తమ గ్రామంలో పాటు నాలుగు కాలనీలు వల్లకాడు అవుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మైనింగ్‌తో జీవనోపాధి

తమకు మైనింగ్‌ ఏర్పాటుతో జీవనోపాధి లభిస్తుందని, అనుమతులు మంజూరు చేయాలని తుమ్మలతలుపూరు గ్రామస్తులు తెలిపారు. మరికొందరు మైనింగ్‌ వద్దంటూ తీవ్ర స్వరంతో విన్పించారు. కొంత సేపు మాటల యుద్ధమే నడిచింది. దీంతో పోలీసులు రెండు గ్రామాల వారిని సర్దుబాటు చేయడంతో సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ప్రజల మనోభావాలను పరిగణంలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నామని జేసీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు సీఐ చినసత్యనారాయణ, ఎన్విరాల్‌మెంట్‌ అధికారి అశోక్‌ కుమార్‌, తహసీల్దార్‌ సుభద్ర, ఎంపీడీఓ ఎంవీ రామ్మోహన్‌రెడ్డి, ఆర్‌ఐ ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement