సంస్కృతం.. ‘పట్టా’భిషేకం | - | Sakshi
Sakshi News home page

సంస్కృతం.. ‘పట్టా’భిషేకం

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

● ఘనంగా ఎన్‌ఎస్‌యూ 5వ స్నాతకోత్సవం ● 524 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం ● 31మందికి పసిడి పతకాలు

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సం వైభవంగా సాగింది. తిరుపతి మహతి ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నె ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీజీనాథన్‌ కామకోటి, వర్సిటీ చాన్సలర్‌, మాజీ భారత ఎన్నికల అధికారి, పద్మవిభూషణ్‌ నీడా మంగళం గోపాలస్వామి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. స్నాతకోత్సవంలో సంస్కృత వర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమో, పీజీ డిప్లొమో కోర్సులు పూర్తి చేసిన 524 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అకడమిక్‌ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 31మంది విద్యార్థులను బంగారు పతకాలు, నగదు బహుమతులు వరించాయి.

నూతన పరిశోధనల వైపు అడుగులు

స్నాతకోత్సవానికి అతిథులుగా విచ్చేసిన ఐఐటీ డైరెక్టర్‌ వీజీనాథ్‌ కామకోటి, ఎన్‌ఎస్‌యూ చాన్సలర్‌, పద్మవిభూషణ్‌ నీడా మంగళం గోపాలస్వామి మాట్లాడుతూ సంస్కృత వర్సిటీలో ఆధునిక టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ నూతన పరిశోధనల వైపు అడుగులు పడాలని సూచించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయలకు దిక్సూచిగా సంస్కృత భాష నిలుస్తోందన్నారు. సంస్కృత జ్ఞానాన్ని భావి తరాలకు అందించేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

పలు గ్రంథాల ఆవిష్కరణ

స్నాతకోత్సవంలో భాగంగా వర్సిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన మహస్వినీ అనే యూనివర్సిటీ రీసెర్చ్‌ జర్నల్‌ ప్రథమ, ద్వితీయ భాగాలను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే సేమూషి అనే యూనివర్సిటీ న్యూస్‌ లెటర్‌, శివబలరామ పంచాంగం, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ క్యాలెండర్‌ను ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. అనంతరం అతిథులను వర్సిటీ అధికారులు జ్ఞాపికలను అందించి దుశ్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రజనీకాంత శుక్ల, రిజిస్ట్రార్‌ వెంకటనారాయణరావు సభాసంచాలకులు పరమాచార్య గురుకుల కేంద్ర డైరెక్టర్‌ గణపతి భట్‌, విభాగాధిపతులు, ఈసీ మెంబర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement