ఆ పోలీస్‌ స్టేషన్‌ సెటిల్‌మెంట్లకు అడ్డా | - | Sakshi
Sakshi News home page

ఆ పోలీస్‌ స్టేషన్‌ సెటిల్‌మెంట్లకు అడ్డా

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: చంద్రగిరి సబ్‌డివిజన్‌ పరిధిలోని ఓ సీఐ తన పోలీస్‌ స్టేషన్‌లో సివిల్‌ కేసులు సెటిల్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూ వివాదాలు, వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న బాకీలు తీర్చకపోవడం వంటి అంశాల్లో పోలీసులు తలదూర్చకూడదని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ సదరు సీఐ ఏమాత్రం లెక్క చేయడం లేదని ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందే చెబుతున్నారు. సెటిల్‌ మెంట్ల కోసం స్టేషన్‌ పరిధిలోనే నివాసం ఉంటున్న అధికార పార్టీ నేతలను అనధికారికంగా ఆ సీఐ నియమించుకున్నట్టు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఆ నేతలు సివిల్‌ కేసులను గుర్తించి సీఐ వద్దకు తీసుకువస్తే.. అవతలి పార్టీ వారికి తమ ద్వారా ఫోన్‌ చేయించి స్టేషన్‌కు పిలిపించి సెటిల్‌ మెంట్లు చేస్తున్నారని అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు.

ఒప్పుకుంటే రాచమర్యాదలు..

భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదు చేతపట్టుకుని ఆ స్టేషన్‌కు ఎవరు వెళ్లినా సరే.. అవతలి వారితో సెటిల్‌మెంట్‌కు ఒప్పుకుంటే రాచమర్యాదలు జరుగుతాయనీ.. లేదంటే రకరకాల సెక్షన్ల కింద కేసులు తప్పవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సివిల్‌ కేసుల్లో సెటిల్‌ చేసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారన్న మాటలు సీఐ నోటి నుంచి తరచూ వినిపిస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ఆ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మఠం భూములు అధికంగా ఉండడం, ఆ భూముల్లో తరచుగా వివాదాలు చోటుచేసుకోవడంతో ఇరువర్గాల మధ్య సెటిల్‌మెంట్లు చేయడమే పనిగా పెట్టుకున్నారని సమాచారం. అందులోనూ ఆక్రమణ దారులకు మద్దతుగా అధికార పార్టీ కీలక నేత నుంచి ఒక్క ఫోన్‌ వస్తే చాలు ఆయన తన వృత్తి ధర్మాన్ని కూడా మరచి, ప్రవర్తిస్తారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కోసారి రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు లేకున్నా సరే ఎంతటివారినైనా సమయంతో సంబంధం లేకుండా పోలీస్‌ స్టేషన్‌కు ఎత్తుకొచ్చేస్తారని చెబుతున్నారు. తమను ఎందుకు తీసుకువచ్చారు.. ఏం తప్పు చేశామంటే ఆయన నుంచి సమాధానం ఉండదని, చివరకు పోలీసు ఉన్నతాధికారులే చెప్పినా వారిని విడిచిపెట్టడానికి ఆయన ఆలోచిస్తారని ఆరోపిస్తున్నారంటే ఏ స్థాయిలో సెటిల్‌ చేస్తారో ఆలోచించాలి.

అధికార పార్టీ నేతలే మధ్యవర్తులు

అధికార పార్టీకి చెందిన నాయకులే అక్కడ మధ్యవర్తులుగా వున్నారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. మఠం భూములు, ప్రభుత్వ భూముల్లో భారీగా భూ ఆక్రమణలు జరుగుతుండడం, రెవెన్యూ, మఠం అధికారులు పట్టించుకోకుండా వదిలేయడంతో తరచు వివాదాలు జరుగుతున్నాయి. ఆ పరిస్థితిల్లో భూ వివాదానికి కారణమైన వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురాకుండా ఆక్రమణలకు అడ్డుపడే వారిని, నిరుపేదలకు అండగా వెళ్లిన వారిని పట్టుకురావడం, ఆపై అక్రమ నిర్మాణ పనులను దగ్గరుండి కట్టించడం వంటి చర్యలకు ఆ సీఐ పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్టప్రకారం నడచుకోవాల్సిన ఆ సీఐ చట్టవ్యతిరేకతకు పాల్పడుతుండడంపై కొందరు బాధితులు తమ వద్దనున్న ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement