చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేటలో గురువారం అర్ధరాత్రి దుండగులు వీరంగం సృష్టించారు. ఓ ఇంటి ముందు ఉంచిన ఆటోకు నిప్పుపెట్టడంతో ఆటో పూర్తిగా కాలిపోయింది. మరో ట్రాక్టర్‌కు నిప్పు పెట్టడంతో పాక్షికంగా దెబ్బతినింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. ఏ.రంగంపేట గ్రామానికి చెందిన చైతన్య కొబ్బరికాయలు వ్యాపారం చేస్తుంటాడు. అతని ఇంటికి సమీపంలో మరో వ్యక్తి రాజశేఖర్ ఉన్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో టయోట ఇతియోస్ కారులో ముఖాలకు మాస్కులు వేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి చేరుకున్నారు. ఆపై చైతన్య ఇంటి ముందు ఉంచిన ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సమీపంలోని రాజశేఖర్ ట్రాక్టర్‌కు సైతం నిప్పంటించగా, మంటలను గుర్తించిన కుటుంబ సభ్యు లు ఆర్పివేశారు. ఇంతలో కారులో వచ్చిన దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కాలిపోయిన ఆటోను పరిశీలించారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.


