● తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు ● పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ● నిబంధనలు పాటించని పోలీసులు
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు పెట్టేందుకు శ్రీకాళహస్తి పోలీసు స్టేషను వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు, పార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మహిళలను కించపరుస్తూ.. బ్రోకరిజాన్ని భుజాన వేసుకుని.. జర్నలిజాన్ని దిగజారుస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటించారు. బాధ్యతారాహిత్యంగా మహిళలను అవమానపరుస్తూ ప్రచురించిన కథనాలను ఖండించారు. కీచకంగా వ్యవహరిస్తున్న రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బూతు రాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిర్యాదుల వెల్లువ
రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. తిరుపతిలో నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఏబీఎన్ రాధాకృష్ణపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్నట్లు పోలీసులు రసీదు ఇవ్వడానికి నిరాకరించారు. మీరు ఇచ్చిన ఫిర్యాదు పేపర్‌ని ఫొటో తీసుకుని వెళ్లండని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒకటో పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పోలీస్టేషన్‌లో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూక తోటి రాజేష్ ఆధ్వర్యంలో బుచ్చినాయుడుకండ్రి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంకటగిరి, రాపూ రు మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు మహిళా విభాగం నేతలు ఆయా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై రైల్వేకోడూరులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విషపు రాతలపై విరుచుకుపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణపై దుమ్మెత్తి పోశారు. మహిళలను కించపరుస్తూ అల్లిన ‘చెత్త పలుకు’పై ఆందోళబాట పట్టారు. విలువలన్నీ విడిచేసి..బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనలు చేపట్టారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికి వ్యాఖ్యలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎండీని శిక్షించాలంటూ పోలీస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఇదిలావుండగా పలు పోలీస్టేషన్లలో ఖాకీలు స్వామి భక్తికి ప్రాధాన్యమిచ్చారు. నిబంధనలు మరిచి.. వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదులను కూడా స్వీకరించకుండా మొండికేశారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా..
ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటించారు. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో, నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. గంగాధరనెల్లూరులో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఆధ్వర్యంలో ఆయా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఐరాల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


