టీటీడీకి రూ.10 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

● 23 వరకు అవగాహన కల్పించండి ● పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌ ● ప్రైవేటు పాఠశాల వ్యాను నిలిపివేత

తిరుమల: బెంగళూరుకు చెందిన జి.విజయ్‌ హేమంత్‌ అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,104 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్‌.వెంకయ్య చౌదరికి విరాళ డీడీని అందజేశారు.

పోషణ్‌ పక్షోత్సవాలు తప్పనిసరి

తిరుపతి అర్బన్‌: ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో పోషణ్‌ పక్షోత్సవాలను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో ఐసీడీఎస్‌ ఉద్యోగులతో కలసి పోషణ్‌ పక్షోత్సవాల పోస్టర్‌తోపాటు హబ్‌ అంగ్‌వాడీ కేంద్రాలకు సంబంధించి పూర్వ ప్రాథమిక సంరక్షణ విద్య మెటీరియల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు జరుపుకోవాలన్నారు. ప్రధానంగా తల్లీబిడ్డల పోషణ్‌, మెదడు వికాసం, ఆటల ద్వారా విద్య, స్క్రీన్‌ టైమ్‌ తగ్గింపు, అంగన్‌వాడీల బలోపేతం, పిల్లల సంరక్షణతోపాటు వారి పోషణలో పురుషుల భాగస్వామ్యం అనే ఆరు అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ వసంతబాయి, నోడల్‌ ఆఫీసర్‌ వాసంతి, సీడీపీఓ ఉమామహేశ్వరి, జిల్లా కోఆర్డినేటర్‌ భువన్‌, ప్రథమ్‌ సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మేం నాయకులం..

ఫీజు కట్టం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పాకాల మండలంలోని టీడీపీ నాయకుడు తన అనుచరులతో కలసి ప్రైవేటు పాఠశాల వ్యానును ఆపి, దౌర్జన్యం చేసి, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు కథనం మేరకు.. నేండ్రగుంటకు చెందిన టీడీపీ ప్రధాన నాయకుడి కుమార్తె తిరుపతికి సమీపంలోని ఓ పాఠఽశాలలో చదువుతోంది. గత రెండేళ్లుగా ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యం పలుసార్లు ఫీజు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. సదరు నాయకుడు ఫీజులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ రుబాబు చూపించాడు. దీంతో విసుగు చెందిన పాఠశాల యాజమాన్యం ఆ నాయకుడి కుమార్తెను వ్యానులో ఎక్కించుకోకూడదని, పాఠశాలకు రానివ్వకూడదని నిర్ణయించుకుంది. అయితే విషయం తెలుసుకున్న ఆ నాయకుడు రెండు రోజుల క్రితం నేండ్రగుంట మీదుగా విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతున్న వ్యానును ఆపి టీడీపీలోని చోటా, మోటా గ్యాంగ్‌తో హల్‌చల్‌ చేశాడు. ఫీజులు కట్టకపోతే ఎం చేస్తారంటూ నానా మాటలు మాట్లాడి వ్యాను డ్రైవరుతో పాటు విద్యార్థులు భయభ్రాంతులకు గురిచేశారు. విద్యార్థుల ముందు దౌర్జన్యంగా ప్రవర్తించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార పార్టీ పెద్దలు ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ఎంఈఓ, హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు

వెంకటగిరి(సైదాపురం): పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డీఈఓ కార్యాలయం వెంకటగిరి ఎంఈఓ, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి రాధకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆ ఆరోపణలకు సంబంధించి రెండు రోజుల్లో వివరాలు వెల్లడించాలని అధికారులు సూచించారు.

11న ‘మహతి’లో

పూలే జయంతి

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు టీటీడీ అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీలో అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు హాజరు కావాలని కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement