తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా, వారు మెచ్చేలా శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ప్రసారాలను విస్తరించనున్నట్లు టీటీడీ జేఈఓ (వైద్యం, విద్య), ఎస్వీబీసీ ఇన్‌చార్జి సీఈఓ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం తొలిసారిగా కార్యాలయానికి వచ్చిన ఆయన వివిధ శాఖల ప్రతినిధులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందేలా కార్యక్రమాలను ఆకర్షణీయంగా రూపొందించాలని సూచించారు. శతమానంభవతి కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించి ప్రతి భక్తునికీ శ్రీవారి ఆశీర్వచనం, అక్షింత లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాను భూతి కార్యక్రమాన్ని అందరికీ చేరువగా తీసుకువస్తా మని చెప్పారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఆకర్షణీయమైన భక్తి కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను, ఇతర కార్యక్రమాలను మరింత విస్తృతంగా భక్తులకు చేరవేయనున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలను మరింత నాణ్యంగా అందిస్తామని పేర్కొన్నారు.


