రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఉద్యోగుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఉద్యోగుల ఆందోళన

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

● నల్ల బ్యాడ్జీలతో నిరసన

● నల్ల బ్యాడ్జీలతో నిరసన

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): వైద్య విద్య–ఆరోగ్య శాఖల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఈఎస్‌ఐ ఆస్పత్రుల వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం నుంచి జిల్లా వైద్య విధాన పరిషత్‌కు నిరసన సెగ తగిలింది. నల్లబ్యాడ్జీలు ధరించి కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. వారి డిమాండ్ల సాధనకు పోరు బాటపడుతున్నారు.

చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య విధాన పరిషత్‌ అధికారులకు యూనియన్‌ నాయకులు సోమవారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ మేరకు బుధవారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటూ నిరసన తెలపాలని, 11వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆస్పత్రుల గేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించాలని యూనియన్‌ నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్‌లో 80 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, 300మందికి పైగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరందరూ ఆందోళనల్లో పాల్గొంటారని యూనియన్‌ నాయకులు వెల్లడిస్తున్నారు.

ఏళ్ల తరబడి పోరాటం

వైద్య రంగంలో ఉద్యోగుల హక్కుల కోసం గత 73 ఏళ్లుగా పోరాడుతున్నామని యూనియన్‌ నేతలు తెలిపారు. 1999లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయించడం, కారుణ్య నియామకాలు సాధించడం, పెన్షన్‌, సేవా విషయాల్లో అనేక సమస్యలు పరిష్కరించడం తమ యూనియన్‌ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. వివిధ విభాగాధిపతులతో జరిగిన సంయుక్త సమావేశాల ద్వారా పెండింగ్‌ సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు. అయి తే ప్రస్తుతం పలు కీలక సమస్యలు మళ్లీ పేరుకుపోయాయని, ముఖ్యంగా కాంట్రాక్ట్‌ మరియు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. 2001 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని, వేతనాల్లో కోతలు విధించడం అన్యాయమని మండిపడ్డారు.

వైద్యసేవలపై నిరసనల ప్రభావం

వీటితోపాటు పలు సాంకేతిక, పరిపాలనా సిబ్బంది సంబంధిత సమస్యల పరిష్కారాన్ని యూనియన్‌ కోరింది. ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్చలకు రావాలని యూనియన్‌ హెచ్చరించింది. లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది. వైద్య సేవలపై ఈ నిరసనల ప్రభావం పడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే

12వ పీఆర్‌సీ కమిషన్‌ నియమించి 36 శాతం ఐఆర్‌ మంజూరు

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పద్ధతి అమలు

పెండింగ్‌ డీఏలు, సరెండర్‌ లీవ్‌ జీతాల చెల్లింపు

నర్సింగ్‌, పారా మెడికల్‌ సిబ్బందికి రిస్క్‌, నైట్‌ డ్యూటీ అలవెన్సులు

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాల పెంపు

ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్లు

ఎన్‌హెచ్‌ఎమ్‌ సిబ్బందికి సమయానికి జీతాలు, సెలవులు

Advertisement
 
Advertisement
Advertisement