తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతికి చెందిన పి.సతీష్ కుమార్, పి.రోజా దంపతులు బుధవారం ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు దాత బుధవారం విరాళం డీడీని స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ ఎం.రవిచంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఈఓ అభినందించారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ గణితశాస్త్ర విభాగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఈ ఏడాది జూలై 18వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం విభాగాధిపతి ప్రొఫెసర్ జయసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కరపత్రాలను వీసీ నరసింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు వర్సిటీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వీయూలో పీజీ మాథమాటిక్స్, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొని, జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు సుగుణమ్మ, భారతి, సుధాకరయ్య పాల్గొన్నారు.
పాలిసెట్‌కు
వెల్లువెత్తిన దరఖాస్తులు
తిరుపతి సిటీ: పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయని జిల్లా కోఆర్డినేటర్, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు. పాలిసెట్ దరఖాస్తులు, కళాశాలలో కొనసాగుతున్న ఉచిత శిక్షణపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి సుమారు 87 వేల సీట్లు ఉన్నాయని, ఇందుకోసం ఇప్పటి వరకు దాదాపు 1.52 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు. చిన్న వయస్సులో ఉపాధి అవకాశాలను దక్కించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడంలో డిప్లొమో కోర్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. పాలిసెట్‌కు గురువారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నందున ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అప్రమత్తం కావాలని సూచించారు.
ఉచిత కోచింగ్‌కు విశేష స్పందన
పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష కోసం పదో తరగతి పరీక్షలు రాసిన, పాసైన విద్యార్థులకు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఊహించని స్థాయిలో ఉచిత కోచింగ్‌కు స్పందన లభించిందని, ఇప్పటికే సుమారు 500 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరువుతున్నారని చెప్పారు. కళాశాలలో ఈనెల 2వ తేదీ నుంచి గర్‌ల్స్‌కు, బాయ్స్‌కు వేర్వేరుగా నిపుణులైన కళాశాల అధ్యాపకులతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కోచింగ్‌తో పాటు ఉచితంగా మెటీరియల్స్ సైతం అందజేస్తున్నట్లు చెప్పారు.
చిన్నపిల్లల హృదయాలయానికి రూ.10 లక్షల విరాళం
తిరుపతి తుడా: నగరానికి చెందిన కే అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమార్తె శారద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు విరాళ డీడీని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆస్పత్రిలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


