గిరిజనుల అక్రమ నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల అక్రమ నిర్బంధం

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

చోరీ నెపంతో గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఐదు రోజులుగా అక్రమం నిర్బంధం

అని బాధితుల ఆవేదన

చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఆరోపణ

పోలీసుల తీరుపై గిరిజన సంఘాల తీవ్ర ఆగ్రహం

చంద్రగిరి: గిరిజనులను అర్ధరాత్రి కిడ్నాపర్ల తరహాల్లో పోలీసులు ఎత్తుకెళ్లి, అక్రమంగా నిర్బంధించడంపై చవటకాల్వ ప్రజలు మండిపడుతున్నారు. ఐదు రోజులుగా పోలీసు స్టేషన్‌లో ఉంచుకుని చిత్రహింసలకు గురి చేస్తూ, చేయని నేరాన్ని అంగీకరించాలని వారిని కొడుతున్నారని మహిళలు కన్నీటి పర్యంతమవుతున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ చవటకాల్వకు చెందిన నాగరాజు, పవన్‌ కల్యాణ్‌, బాలాజీ, నరసయ్య కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నెల 4వ తేదీ శనివారం రాత్రి చంద్రగిరి పోలీసులు మఫ్టీలో చవటకాల్వకు చేరుకున్నారు. గ్రామంలోని నాగరాజు, పవన్‌ కల్యాణ, బాలాజీ, నరసయ్య ఇళ్లలోకి చొరబడి వారిపై దాడికి పూనుకున్నారు. అసలు మీరు ఎవరు..ఎందుకు మా వాళ్లను తీసుకెళుతున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదన్నారు. తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలను తీసుకెళ్లినట్లుగా తెలిపారు. ఆదివారం ఉదయం పోలీసు స్టేషన్‌కు వెళితే తమ వద్ద ఎవరూ లేరని పోలీసులు బుకాయించారని బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. తమ వారికి చెందిన వాహనాలను చూసి, ఆందోళనకు దిగుతామని చెప్పడంతో, ఓ చోరీ కేసులో అరెస్టు చేశామని, వారు తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారని గ్రామస్తులు చెప్పారు.

ఆందోళనలో బాధిత కుటుంబాలు

చిత్రహింసలకు గురి చేస్తూ..!

తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో ఉన్న తమ వారిని కలిసేందుకు వెళ్లగా వారిపై పోలీసులు విచక్షణరహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. చేయని తప్పును అంగీకరించాలంటూ పోలీసులు తమ వారిని కొడుతున్నారని కుటుంబ సభ్యులకు తెలియజేశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement