తిరుపతి అర్బన్: జలధార–జలహారతిపై అధికారులు సమష్టిగా పనిచేసి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుంటూ నీటి భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ అంశం రానున్న 4–5 ఏళ్లకు అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. ఆదే మార్గంలో తిరుపతి జిల్లాను నడిపిద్దామని తెలిపారు. ప్రధానంగా ప్రతి చెరువు, కాలువ, వాగులను పరస్పరం అనుసంధానం చేసి వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడమే ప్రధానమన్నారు. ఇందుకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డీపీఓ సుశీలాదేవి, ,పంచాయతీరాజ్ ఎస్‌ఈ మధుసూదన్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా అధికారి నరేంద్ర, ఇరిగేషన్ డీఈలు రాధాకృష్ణ, శివారెడ్డి, డీఏఓ ప్రసాద్‌రావు, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రవికుమార్, సూక్ష్మసేద్య జిల్లా అధికారి చిన్నరెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయండి
ఆయాశాఖల పరిధిలో కేటాయింపు చేసిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి మంజూరైన పనులు, వాటి పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పని, పెద్ద పని అనే తేడా లేకుండా గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబందించి భూసేకరణ, పనులు నాణ్యతతోపాటు వేగవంతానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సీ రవిమనోహరచ్చారీ, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, ఏపీఐఐసీ జోనల్ మేనేరజ్ విజయభరత్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారి రాధకృష్ణ తదితతరులు పాల్గొన్నారు.


