భారీగా గంజాయి స్వాధీనం
చంద్రగిరి: కూటమి ప్రభుత్వంలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోందనడానికి ఇదొక నిదర్శనం. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి రవాణాను పోలీసులు చేధించారు. మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి గాదంకి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి తమిళనాడుకు వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారు డోర్ లోపల, డ్యాష్ బోర్డు, గేర్‌బాక్స్, స్టెప్‌నీ టైర్ లోపల, స్టెపనీ వెనుక రహస్య ఛాంబర్‌లో ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనుమానం రాకుండా
శునకాన్ని రక్షణగా ఉంచుకుని
విశాఖ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న గంజాయి రవాణాపై ఎవరికీ అనుమానం రాకుండా డ్రైవరు తన తెలివితేటలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కారు వెనుక భాగంలో ఓ భారీ సైజులోని శునకాన్ని ఉంచుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎవరైనా వాహనాలను తనిఖీ చేసేందుకు వస్తే వారిపైకి శునకం పెద్ద ఎత్తున అరవడంతో, అధికారులు బెంబేలెత్తిపోతారన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలో గంజాయిను తరలిస్తున్న బొలెరోతో పాటు డ్రైవరును, శునకాన్ని పోలీసులు చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన గంజాయిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.


