మోసం కేసులో నిందితులు..
వరదయ్యపాళెం: తూకంలో మోసం చేసేందుకు ఏకంగా వే బ్రిడ్జికి చిప్పును అమర్చి మోసానికి పాల్పడిన వారిని శ్రీసిటీ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ బీవీ శ్రీనివాసులు కథనం మేరకు.. శ్రీసిటీలోని డానియల్ పరిశ్రమ సమీపంలోని డీపీజెడ్ ప్రాంతంలో ఉన్న వే బ్రిడ్జి వద్ద కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి తూకాల్లో మోసం చేసేందుకు కొన్ని పరికరాలను అమర్చి మోసానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం ఏజీఎం రమేష్ శ్రీసిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ అరుణ్ కుమార్ రెడ్డి, సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తించి సోమవారం అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఇమ్రాన్‌బాషా, బాబా సాహేబ్, ఇషాద్ బాషా, మనోజ్ నాయక్, మహ్మద్ అబ్బాస్‌తోపాటు గుమ్మడిపూండికి చెందిన జాకీర్ హుస్సేన్ బాషా ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరినట్లు ఎస్‌ఐ తెలిపారు.


