సమస్యలు పరిష్కరించండి
తిరుపతి అర్బన్:‘సార్.. మా సమస్యలు పరిష్కరించండి’ అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, సుధారాణిని ప్రాధేయపడ్డా రు. కలెక్టర్‌తోపాటు అధికారులు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 266 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపై 169 అర్జీలు వచ్చాయి.
ఆత్మహత్యానికి పాల్పడితే కేసులు తప్పవు
సమస్యలు ఉంటే వాటికి పరిష్కారానికి పోరాటాలు చేయడం తప్పుకాదని కలెక్టర్ అన్నారు. అయితే పెట్రోల్‌తో కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఊరుకోబోమని, వారిపై కేసులు పెడ తామని హెచ్చరించారు. ఒకరిని చూసి మరొకరు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు.
ఒక్కో అటెండర్ 20 మందిని పంపేస్తున్నారు!
పీజీఆర్‌ఎస్‌లో 10 మంది వరకు అటెండర్లు పనిచేస్తున్నారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ఉదయం వచ్చినా అర్జీలను సిద్ధం చేసుకుని క్యూలో నిల్చున్నా అధికారులను కలవడానికి మధ్యాహం 2 గంటలవుతోంది. అయితే అక్కడ పనిచేస్తున్న అటెండర్లు మాత్రం దర్జాగా ఆయన మా వీధిలో వాడు, ఆయన మా స్నేహితుడికి కావాల్సిన వారు, ఆయన బంధువు అంటూ ఒక్కో అటెండర్ గ్రీవెన్స్‌లో అడ్డదారిలో 10 నుంచి 20 మందికిపైగా అధికారులను కలవడానికి పంపేస్తున్నారు. దీంతో పలువురు అర్జీదాలులు ప్రశ్నించడంతో వాగ్వావాదం చోటుచేసుకుంది.
ప్రభుత్వ భూమని ఆక్రమించి మొక్కలు నాటేశారు!
అధికారపార్టీ నేతల అండతో చెంగల్‌రెడ్డి అనే నేత ప్రభుత్వ భూమిని ఆక్రమించి మొక్కలు నాటేశారని ఎర్రవారి పాళెం మండలంలోని చెరుకువారి పల్లి గ్రామానికి చెందిన నాగరాజు అన్నారు. దశాబద్దాలుగా ప్రభుత్వ భూమిలో ఉన్న బండి బాట మీదుగా అవతల వైపు ఉన్న తమ పొలంలోకి వెళ్లేవాళ్లమని చెప్పారు. అయితే తాజాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి మొక్కలు నాటి, ఆ మార్గాన్ని మూసి వేశారన్నారు.
మా బిడ్డకు పింఛన్ ఇవ్వండి
తమ బిడ్డకు పింఛన్ ఇవ్వాలని సత్యవేడు మండలం శిరసనంబేడు గ్రామానికి చెందిన సోనియా, ఆమె భర్త పేరు అన్నమలై కోరారు. తమ కుమార్తె గాయత్రి నాలుగో తరగతి చదువుతోందన్నారు. ఇటీవల అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రిలో చూపించామని, ఆమెకు ఒక కిడ్నీ మాత్రమే ఉందని డాక్టర్లు చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె గాయత్రికి పింఛన్ ఇప్పించాలని కోరారు.
సమస్యలు పరిష్కరించండి
సమస్యలు పరిష్కరించండి


