‘డయల్ యువర్ సీఎండీ’కి విశేష స్పందన
గతవారం వచ్చిన సమస్యల
పరిష్కారంపై ఆరా
కొత్తగా 76 మంది ఫిర్యాదు
ఉన్నతాధికారులతో సమీక్షించిన ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నిర్వహిస్తున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంర్ నిర్వహించిన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 76 మంది విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. అందులో అత్యధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, గృహాలపై వెళ్లే విద్యుత్ లైన్లు, పాఠశాల ప్రాంగణంలోని విద్యుత్ లైన్ల మార్పు, కాలిపోయిన/చోరీకి గురైన ట్రాన్స్ ఫార్మర్లను మార్చడంలో జాప్యం, విద్యుత్ బిల్లులు, విద్యుత్ లైన్లు/స్తంభాల మార్పిడి, విద్యుత్ లైన్లకు దగ్గరగా చెట్ల కొమ్మలు ఉండడం, ఇనుప విద్యుత్ స్తంభాల మార్పు, విద్యుత్ స్తంభాలపై డిష్ వైర్లు వేలాడుతుండడం, తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం తదితర సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై ఫిర్యాదు చేసిన వారికి సీఎండీ శివశంకర్ లోతేటి సమాధానమిస్తూ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో ప్రత్యేకాధికారులు ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. గత సోమవారం నిర్వహించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా నమోదైన 87 సమస్యల్లో 62 సమస్యలను కేవలం వారం రోజుల్లో పరిష్కరించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్‌రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, కె. ఆదిశేషయ్య, పి. సురేంద్ర నాయుడు, ఎం. మురళీ కుమార్, జనరల్ మేనేజర్లు సీహెచ్ రామచంద్రరావు, జి. చక్రపాణి, డి. సురేంద్రరావు, సి. ప్రసాద్, వై. వెంకటరాజు, పి.భాస్కర్‌రెడ్డి, డి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


