కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ వేధింపులు | - | Sakshi
Sakshi News home page

కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ వేధింపులు

Aug 4 2025 5:28 AM | Updated on Aug 4 2025 5:28 AM

కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ వేధింపులు

కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ వేధింపులు

● బలవంతంగా రుద్దుతున్న ప్రభుత్వం ● ప్రభుత్వ అనుబంధ సంస్థలదీ అదే పరిస్థితి ● తలలు పట్టుకుంటున్న అధికారులు ● చేతులెత్తేసిన ప్రజాప్రతినిధులు ● టీడీపీ సానుభూతి పరులనే ఎంపిక చేస్తున్నట్లు విమర్శలు

తిరుపతి తుడా: ప్రజాసంక్షేమం..అభివృద్ధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. అత్త సొమ్ము అల్లుడు దానం చందాన పేదరిక నిర్మూలన పేరుతో కొత్తడ్రామకు తెరలేపింది. పేద ప్రజలకు ప్రభుత్వం చేయాల్సింది చేయకపోగా ఆ బాధ్యతలను అధికారులు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు అప్పగించింది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఉన్నతాధికారుల మెడపై కత్తిపెట్టి ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజూ రాష్ట్రస్థాయి అధికారులు.. జిల్లా, మండ ల స్థాయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. తా ము ఉద్యోగాలు చేయాలా? లేక ఎంపిక చేసుకున్న కుటుంబాల చుట్టూ తిరగాలా? అంటూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా కుటుంబాలను దత్తత తీసుకుని తీరాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. శృతి మించి తమకు కుటుంబాల సంఖ్యను అప్పగిస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ లోలోన మదనపడుతున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవరిస్థాయిలో వారు తికమక పడుతున్నారు. ప్రభు త్వం మాత్రం టార్గెట్‌ విధించి ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాల్సిందేనంటూ వేధింపులకు దిగుతోంది.

అంతా టీడీపీ సానుభూతి పరులేనా?

నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమం అంతా అధికారపార్టీ సానుభూతి పరుల కోసమే నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు కుటుంబాల కోసం ఎంపిక చేసిన కుటుంబాలు టీడీపీకి అనుకూలంగా ఉన్న వారేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ అవసరాలు, జీవన ప్రమాణాలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువులు తదితర అంశాల ఆధారంగా పీ4కి కుటుంబాలను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ టీడీపీ స్థానిక నేతలు, వారి అనుచరులు సూచించిన కుటుంబాలనే బంగారు కుటుంబాల జాబితాలో చేర్చినట్లు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. కుటుంబాల ఎంపికలో పారదర్శకత పాటించలేదని, ప్రధానంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న కుటుంబాలనే ఎంపిక చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. భవిష్యత్తులో ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడమే పీ4 లక్ష్యం అని అధికారులు సైతం భావిస్తున్నారు.

దయనీయంగా టీచర్ల పరిస్థితి

ప్రభుత్వం ఇచ్చే జీతాలపైనే ఆధారపడే టీచర్లకు పీ4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటూ విద్యాశాఖ నుంచి ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి టీచర్‌ కనీసం రెండు, మూడు కుటుంబాలను దత్తత తీసుకునేలా అధికారులు పావులు కలుపుతున్నారు. దీనిపై టీచర్లు భగ్గుమంటున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాలా? లేక ఇతర పనులు చేయాలా? అంటూ మండిపడుతున్నారు.

సచివాలయ ఉద్యోగులకూ తప్పని తిప్పలు

అనుబంధ సంస్థలదీ అదే పరిస్థితి..

పీ4 ఎఫెక్ట్‌ ప్రభుత్వ అనుబంధ సంస్థలపై మరింత భారం పడుతోంది. భయపెట్టి మార్గదర్శకులుగా ఉండాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల నిర్వాహకులకు భారం తప్పడం లేదు. అలానే పెట్రోల్‌ బంక్‌ యజమానులు, గ్యాస్‌ డీలర్లపై ఎక్కువ కుటుంబాలను అప్పగించేందుకు ప్ర భుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్కొక్కరు 50 కుటుంబాలకు తగ్గకుండా దత్తత తీసుకోవాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. తమకు అప్పగించిన పనులను సకాలంలో చక్కబెట్టడమే భారంగా ఉంటే దత్తత తీసుకున్న కుటుంబాల బాగోగులను చూడడం ఎలా సాధ్యమవుతుందంటూ లోలోన మదన పడుతున్నారు.

బలవంతంగా రుద్దుతున్న ప్రభుత్వం

నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. బంగారు కుటుంబాల బాధ్యతలను చేపట్టాలంటూ జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు పంచాయతీ స్థాయి ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతున్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేయాల్సింది చేయకపోగా బంగారు కుటుంబం పేరుతో అధికారుల మెడకు చుట్టుతున్నారు. కచ్చితంగా ప్రతి అధికారి రెండు నుంచి ఐదు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ టార్గెట్‌ ఇచ్చారు. ఇప్పటికే సర్వేలు, రివ్యూలు, ఇతర ప్రభుత్వ టార్గెలతో తలమునకలైన అధికారులకు బంగారు కుటుంబాల కార్యక్రమం తలనొప్పిగా మారింది. వారు దత్తత తీసుకోవడంతో పాటు తమ పరిధిలోని అధికారులు, వ్యాపారస్తులకు అప్పగించేందుకు వెంటపడుతున్నారు. దీంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. తాము చేయాల్సిన పనికాకుండా ప్రభుత్వం చేసే పనులను సైతం ఉద్యోగులకు అప్పగించడం సరైన విధానం కాదని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు వారి పరిధిలోని కిందిస్థాయి అధికారులపై అప్పగింతలను బలవంతంగా రుద్దుతున్నారు. ఇక మండల స్థాయి అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఉద్యోగాలు వదిలి ఈ పనులపైనే పరుగులు పెట్టాల్సిన దుస్థితిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

చేతులెత్తేసిన ప్రజాప్రతినిధులు

ప్రభుత్వం చేపట్టిన పీ4 ప్రక్రియ చేపట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఒక్కో ఎమ్మెల్యేకి 100 కుటుంబాలు, ఎంపీకి 500 కుటుంబాలు అప్పగించి, నిరుపేద కుటుంబాల బాధ్యతలను మీరే చూసుకోవాలని చెప్పాల్సి ఉండగా, ప్రభుత్వం మాత్రం ప్రజా ప్రతినిధుల జోలికి వెళ్లకుండా ఆ భారాన్ని ఉద్యోగులు, అధికారులపై మోపుతోంది. ప్రభు త్వం నుంచి ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమంపై కనీస ఒత్తిడి లేకపోవడంతో తమకు సంబంధం లేదన్నట్లు చేతులెత్తేశారు. దీంతో దత్తత బాధ్యత అంతా అధికారులపై పడుతోంది.

వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి అనధికారిక ఆదేశాలు అమలవుతున్నాయి. ప్రతి సచివాలయ కార్యదర్శి కనీసం ఒకరిద్దరినైనా దత్తత తీసుకోవాల్సిందే అంటూ బలవంతం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా దత్తత తీసుకునే మార్గదర్శకులను సైతం వెతికి పట్టాలనే వేధింపులు కూడా మొదలయ్యాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి మార్గదర్శకులను చూడాల్సిన పనులను అప్పగించారు. వివిధ సర్వేలు, సమీక్షలు, వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌ లతో ఇప్పటికే సతమతం అవుతున్న సచివాలయ ఉద్యోగులు కిందిస్థాయి సిబ్బందికి పీ4 మరింత ఒత్తిడి తెచ్చిపెట్టింది. సచివాలయ ఉద్యోగులు రూ.30 వేలు, కింది స్థాయిలో ఉద్యోగులు రూ.40 వేల లోపు వేతనాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఉద్యోగులు కూడా కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యోగులకు బంగారు కుటుంబం చేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

19 వేల మంది మార్గదర్శకులు అవసరం

తిరుపతి జిల్లాలో బంగారు కుటుంబాల గుర్తింపు, పీ4 అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వివిధ ప్రమాణాల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 83,550మంది నిరుపేద కుటుంబాలను పీ4 కోసం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఈ కుటుంబాలను దత్తత తీసుకోవాలంటే దాదాపు 22 వేల మందికిపైగా మార్గదర్శకులు అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి 3,500 మంది మార్గదర్శకులను అతికష్టం మీద ఎంపిక చేశారు. మరో 19 వేల మంది దత్తత తీసుకునే మార్గదర్శకులు అవసరం ఉంది. ఇందుకోసం అధికారులు మండల స్థాయి అధికారులపై సైతం తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కనీసం రెండు మూడు కుటుంబాలనైనా దత్తత తీసుకోవాలంటూ బలవంతం చేస్తుండడంతో ఉద్యోగులు అయోమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement