
5 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడా పోటీలను శాప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్.శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు తిరుపతిలోని ఎస్వీయూ క్రీడా మైదానం, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాకీ గ్రౌండ్, పాత ఏజీఎస్ కళాశాల మైదానాల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్ క్రీడల్లో సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులు, జట్లకు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జోనల్ స్థాయిలో, అక్కడ ప్రతిభ చూపిన జట్లు, క్రీడాకారులకు 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా జిల్లాకు చెందిన వారై ఉండాలని, అలాగే 22 ఏళ్లలోపు వయస్సున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 90596 06346, 99484 44759 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
పరారీ ఖైదీ అరెస్టు
సత్యవేడు: సబ్‌జైలు నుంచి ఆదివారం ఉదయం పారిపోయిన ఖైదీ శ్రీనివాసులు అలియాస్ శ్రీను(18)ని పోలీసులు అరెస్టు చేశారు. పిచ్చాటూరు మండలం కారూర్ గ్రామానికి చెందిన శ్రీణివాసులు చోరీ కేసులో కొద్ది రోజులుగా సత్యవేడు సబ్‌జైలులో ఉన్నాడు. ఆదివారం ఉదయం కాలకృత్యాలకు అనుమతించిన సమయంలో శ్రీను జైలు గోడ ఎక్కి దూకి పారిపోయాడు. విషయం తెలుసుకున్న జైలు సూపరింటెండెంట్ కరిముల్లా, సత్యవేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మురళినాయుడు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రామస్వామి బృందంతో కలసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి ఖైదీని అరెస్టు చేశారు.
లారీబోల్తా.. డ్రైవర్‌కు గాయాలు
చిల్లకూరు: కర్ణాటక నుంచి నెల్లూరుకు వెళుతున్న ఓ లారీ రైటార్ సత్రం సమీపంలో ఆదివారం వేకువ జామున బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి నెల్లూరుకు శనివారం రాత్రి లోడ్‌తో బయలు దేరిన లారీ వేకువజామున మండలంలోని రైటార్ సత్రం వద్దకు వచ్చే సరికే డ్రైవర్ కునుకు తీయడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌కు గాయాలు కాగా లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. దీనిపై లారీ డ్రైవర్‌ను విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

5 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు