తమిళనాడులో ఉద్యోగం.. ఆంధ్రలో రాజకీయం

- - Sakshi

సాక్షి, తిరుపతి: సత్యవేడు టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఇన్‌చార్జ్‌ హెలెన్‌ తీరునచ్చని టీడీపీలోని మరోవర్గం ఆమె రాజీనామా ‘డ్రామా’ ఆడుతోందంటూ ఆధారాలతో బయటపెట్టారు. టీడీపీ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారని చంద్రబాబుని నమ్మించి సత్యవేడు నుంచి పోటీచేసేందుకు హై డ్రామా ఆడారంటూ ఆ పార్టీలోని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలకు బలం చేకూరేలా హెలెన్‌ తమిళనాడులో ఉద్యోగం చేస్తూ.. ఏపీలో రాజకీయం చేస్తోందంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల మధ్య వర్గపోరుతో సత్యవేడు రాజకీయం రంజుగా మారింది.

సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్‌. హేమలత వారసురాలిగా హెలెన్‌ను తెరపైకి తెచ్చిన మాజీ ఎమ్మెల్యే సత్యవేడు ఇన్‌చార్జ్‌గా తన కుమార్తెను ప్రకటింపజేశారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీలోని మరో రెండు వర్గాలు మాజీ ఎమ్మెల్యే హేమలత, కుమార్తె హెలెన్‌ విషయాలను బయటపెట్టడం ప్రారంభించారు. సోషల్‌ మీడియా వేదికగా గతంలోనే హేమలతపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే కుమార్తె హెలెన్‌పైనా అదే స్థాయిలో ప్రచారం ప్రారంభించారు.

ప్రస్తుత టీడీపీ సత్యవేడు ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ హెలెన్‌ తమిళనాడులోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తూ, ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని సొంత పార్టీనేతలే విమర్శిస్తున్నారు. నాగలాపురం ఈస్ట్‌ దళితవాడకు చెందిన ఎ.సెల్వకుమార్‌ నమోదు చేసుకున్న ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా డాక్టర్‌ హెలెన్‌ ప్రస్తుతం ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా బయటపెట్టారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద డాక్టర్‌ హెలెన్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు చెప్పారని, కానీ ప్రస్తుతం అక్కడా నేనే.. ఇక్కడా నేనే అనే విధంగా ఆమె వ్యవహార శైలి ఉందని ఆ పార్టీ శ్రేణులు పరోక్షంగా విమర్శిస్తున్నారు.

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన హెలెన్‌, అందుకు భిన్నంగా ‘మీరు ఆ వర్గం, మీరు ఈ వర్గం’ అంటూ పార్టీ కేడర్‌లో విబేధాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పార్టీకోసం జెండా మోస్తున్న నిజాయితీగల కేడర్‌ ను అయోమయానికి గురిచేస్తున్నట్లుగా పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హెలెన్‌ వైఖరి మెచ్చని నియోజకవర్గ ఏడు మండలాల్లోని పలువురు నేతలు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ఇద్దరిపై హెలెన్‌ వర్గీయుల ఆగ్రహం
హెలెన్‌ అభ్యర్థిత్వాన్ని నచ్చని మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య, జేడీ రాజశేఖర్‌ వర్గీయులే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆమె వర్గీయులు మండిపడుతున్నారు. 2019లో జేడీని అభ్యర్థిగా ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య కనిపించకుండా పోయారని ఆరోపిస్తున్నారు. పార్టీ నమ్మి టికెట్‌ ఇచ్చి గెలిపిస్తే.. ఎమ్మెల్యేగా ఉన్న ఆ ఐదేళ్లు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకుని, వసూళ్లు చేసుకుని పత్తాలేకుండా వెళ్లిపోయారంటూ హెలెన్‌ వర్గీయులు మండిపడుతున్నారు.

పార్టీ కి ఉపయోగపడని మాజీ ఎమ్మెల్యే తలారి ఇన్‌చార్జ్‌ హెలెన్‌కి టికెట్‌ రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన జేడీ రాజశేఖర్‌ నమ్మిన వారిని నట్టేట ముంచిన వ్యక్తి అని ఆరోపిస్తున్నారు. మండల నాయకుల వద్ద డబ్బులు ఖర్చుచేయించి పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టిన జేడీఆర్‌ హెలెన్‌ని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తుతున్నారు. సత్యవేడు టీడీపీలో గ్రూపులు ప్రోత్సహించింది జేడీఆర్‌ అని ఆమె వర్గీయులు మండిపడుతున్నారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top