వైఎస్సార్‌టీపీ ఆవిర్భావం నేడు 

YS Sharmila Set To Launch Her Party July 8 - Sakshi

సాయంత్రం 5 గంటలకు పార్టీ జెండా, ఎజెండాపై ప్రకటన

జూమ్‌ యాప్‌ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్‌ అభిమానుల సమక్షంలో వైఎస్‌ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని జూమ్‌లో ప్రత్యక్షంగా వీక్షించేలా లింక్‌ను పార్టీ యంత్రాంగం ఇప్పటికే దాదాపు పదివేల మంది వరకు షేర్‌ చేసినట్లు వెల్లడించింది. పార్టీకి సంబంధించి పాలపిట్ట, నీలం రంగుతో కూడిన జెండాను రూపొందించారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా డిజైన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్‌ షర్మిల రోడ్‌మ్యాప్‌ ఖరారైంది.

ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు నివాళులు.. 
గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి షర్మిల ఆశీర్వాదం తీసుకుంటారని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. అనంతరం ఉదయం 10.30కు ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానం లో బేగంపేటకు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి జేఆర్‌సీ కన్వెన్షన్‌కు రానున్నారు. మధ్యలో పంజగుట్ట చౌరస్తాలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పార్టీ ఆవిర్భావ వేడుక జరుగుతుందని అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top