స్నేహితుడి చికిత్స కోసం

Youth Fund Rising in Whatsapp Group For Friend Treatment - Sakshi

వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టి రూ.లక్ష  విరాళాల సేకరణ

ఆదర్శంగా నిలిచిన యువకులు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): చిన్ననాటి స్నేహితుడు రోడ్డు ప్రమాదానికి గురై కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా ఆర్థిక ఇబ్బందుల విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు ఆదుకోవాలని సంకల్పించారు. అంతే ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి స్నేహితుడికి ఆపద వేళ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్లితే... హాజీపూర్‌ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన కోయ లక్ష్మణŠ(23) అలియాస్‌ అరుణ్‌ ఈ నెల 16వ తేదీన మంచిర్యాల వైపు వస్తుండగా పాతమంచిర్యాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ్‌ది నిరుపేద కుటుంబం కావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే దిక్కుతోచని స్థితిలో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో లక్ష్మణ్‌ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వేంపల్లి గ్రామానికి చెందిన పిన్నం వెంకటేశ్, వోలపు రత్నకుమార్, పర్వతి తిరుపతి, ఎలుక మహేందర్‌లు కలిసి సహాయం చేయాలని సంకల్పించారు. ఇందుకు లక్ష్మణ్‌ సహాయ నిధి పేరుతో 130 మందితో కలిపి వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేశారు. గ్రూప్‌ సభ్యులు, మరో 21 మంది సోషల్‌ మీడియా ద్వారా స్పందించి మానవతా దృక్పథంతో తోచిన విధంగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాతల రూపంలో మొత్తంగా రూ.96,042 లను సమకూర్చి ఆస్పత్రిలో బిల్లు మొత్తం కట్టేశారు. లక్ష్మణ్‌ ప్రస్తుతానికి వేంపల్లిలోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆదుకున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష్మణ్‌కు 2006–09 బీజెడ్‌సీ బ్యాచ్‌కు చెందిన చాణక్య డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు సైతం రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top