మరో తిరుమలగా యాదాద్రి !

Yadagirigutta Temple New Look Like Tirumala Tirupati Temple - Sakshi

రోజూ 50 వేల మంది భక్తులు సందర్శిస్తారని అంచనా... ప్రస్తుతం వారాంతాల్లో 40 వేలు మించుతున్న భక్తుల సంఖ్య 

ప్రధాన ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇలవేల్పుగా భావించే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం త్వరలో మరో తిరుమలగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా నిర్మిం చిన ఆలయంలో స్వామి దర్శనం మొదలుకాగానే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. యాదగిరిగుట్టగా ఉన్న దాదాపు వెయ్యేళ్లనాటి ఆలయాన్ని రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రిగా కొత్తరూపుతో పునర్నిర్మించిన విషయం తెలిసిందే.

ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో ఉత్సవమూర్తిని బాలాలయంలో ప్రతిష్టించి దర్శనాలు కల్పిస్తున్నారు. మార్చిలో సుదర్శనయాగాన్ని నిర్వహించి కొత్త ఆలయంలోకి స్వామి వారిని తరలించి మూలవిరాట్టుతో కలిపి దర్శనభాగ్యం కల్పించనున్నారు.  

ప్రస్తుతం 25 వేలమంది వరకు భక్తులు 
ప్రస్తుతం బాలాలయాన్ని నిత్యం 20 వేల నుంచి 25 వేల మంది దర్శించుకుంటున్నారు. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవు దినాల్లో ఆ సంఖ్య 40 వేలను మించుతోంది.  అతి సాధారణ రోజుల్లో 10 వేల నుంచి 12 వేల మంది వస్తున్నారు. అయితే కొత్త ఆలయంలో దర్శనాలు ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్య 50 వేలకు చేరుకుంటుందని అధికారులు అంచనాకొచ్చారు. ఇక సెలవులు, ప్రత్యేక సందర్భాలు, ఉత్సవాల కాలంలో 70 వేలను మించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

తిరుమల వెంకన్నను నిత్యం సగటున 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు దర్శించుకుంటుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య 80 వేలను మించుతుంది. ఈ విధంగా భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే యాదాద్రి రెండో తిరుమలగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.  

పునర్నిర్మాణానికి ముందు 7 వేల వరకు 
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని యావత్తు తెలంగాణ ఇలవేల్పుగా భావిస్తుంటారు. తెలంగాణలోని ప్రతి పల్లెలో స్వామివారిని ఇలవేల్పుగా భావించే కుటుంబాలు భారీగా ఉన్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాకముందు నిత్యం సగటున ఏడు వేల మంది వరకు దర్శించుకునేవారు. ప్రత్యేక సందర్భాల్లో ఆ సంఖ్య 10 వేల వరకు ఉండేది. పునర్నిర్మాణ పనులు మొదలై, నిర్మాణ ప్రత్యేకతలకు ప్రాధాన్యం వచ్చి ప్రచారం జరగటంతో ఒక్కసారిగా ఆలయానికి రద్దీ పెరిగింది.

ప్రధాన ఆలయం పనులు కొలిక్కి రానప్పటికీ, బాలాలయంలో ని స్వామిని దర్శించుకునేవారి సంఖ్య రెండు రెట్లకు చేరింది. సాధారణ భక్తులకు కొత్త దేవాలయంలోకి ఇప్పటివరకు అనుమతి లేదు. రాతి నిర్మాణంగా రూపుదిద్దుకుంటున్న ఆలయ పనులపై ఆసక్తి ఉన్నా, పనులకు ఆటంకం కలగవద్దన్న ఉద్దేశం తో భక్తులను అటువైపు అనుమతించటం లేదు. అయినా రద్దీ  పెరుగుతూనే వస్తోంది. 

ఒకేసారి లక్ష మందికి వసతులు 
ఆలయానికి ఒకేసారి లక్ష మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగని విధంగా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది కూడా భక్తుల సంఖ్య పెరిగేందుకు దోహదపడనుంది. దేవాలయం ఉన్న గుట్టకు మరోవైపు ఉన్న పెద్ద గుట్టను ఏకంగా ఆలయ నగరిగా మార్చేస్తున్నారు.

దాదాపు వేయి ఎకరాల మేర విస్తరించిన ఒక గుట్టను సాధారణ భక్తుల కాటేజీలు, ఇతర వసతులకు కేటాయించారు. ఇందులో 250 ఎకరాల్లో ఒక్కోటి నాలుగు సూట్లు ఉండే 252 కాటేజీలు నిర్మించారు. ప్రెసిడెన్షియల్‌ విల్లాతో పాటు వీవీఐపీలకు కాటేజీలను 13 ఎకరాల్లో విస్తరించిన మరో గుట్టపై నిర్మించారు. 3 వేల మంది ఒకేసారి ఉండేలా క్యూలైన్లను నిర్మించారు. 

పూర్తి రాతి నిర్మాణం 
రాజుల పాలనలో రాతి నిర్మాణాలుగా దేవాలయాలు రూపుదిద్దుకునేవి. ఆ తర్వాత సిమెంటు నిర్మాణాలే చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో తొలిసారి కృష్ణ శిలతో  పూర్తి రాతి నిర్మాణంగా యాదాద్రి రుపుదిద్దుకుంది. ఇది భక్తుల్లో ఎనలేని ఆసక్తిని పెంచింది. ఇక భాగ్యనగరానికి యాదాద్రి కేవలం 70 కి.మీ. దూరంలోనే ఉంది. నాలుగు వరసల రోడ్డు అందుబాటులోకి రావటంతో ప్రస్తుత ప్రయాణ సమయం గంటగంటన్నరగానే ఉంటోంది.

కోటి జనాభా ఉన్న భాగ్యనగరానికి ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది. యాదాద్రి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి కూడా దీన్ని చూసేందుకు భక్తులు వస్తున్నా రు. నగరానికి వచ్చే పర్యాటకులు పనిలోపనిగా ఆలయానికి వస్తున్నారు. చుట్టూ పర్యాటక ప్రాజెక్టులు కూడా రానుండటం తో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top