
ఒక్క వానకే నడుము లోతులో వరద నీటి ప్రవాహం..
నీట మునిగిన అండర్ పాస్
ఫ్లై ఓవర్‌పై వరద నీరు చేరడం కనీవినీ ఎరగం... కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ఫ్లైఓవర్‌పై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.. ఫ్లై ఓవర్ కింద ఉన్న అండర్ పాస్ నీట మునగడం, మరో వైపు కొత్తగూడ జంక్షన్‌లో భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులకు దిక్కుతోచలేదు. హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లై ఓవర్, అండర్ పాస్, జంక్షన్ నీట మునగడం చర్చనీయాంశంగా మారింది. దీనికి హైడ్రా మాన్‌సూన్, జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు బాధ్యత వహించాల్సిందేనని వాహనదారులు పేర్కొంటున్నారు.. మ్యాన్‌హోల్స్ కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ నేతృత్వంలో పని చేస్తున్న మాన్‌సూన్ బృందాలు, శేరిలింగంపల్లి సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జోనల్ కమిషనర్ అన్ని విభాగాల అధికారులతో వరద పరిస్థితులపై సమన్వయ సమావేశం నిర్వహించినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకపోవడంతో భారీగా వరద నీరు (Flood Water) చేరినట్లు స్పష్టమవుతోంది. ఫ్లై ఓవర్ పైన, అండర్ పాస్, జంక్షన్‌లో వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలో మీటరు ప్రయాణానికి దాదాపు 45 నిమిషాలకు పైగా పట్టిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోదారిని తలపించిన ఫ్లై ఓవర్...
అంజయ్యనగర్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వరకు ఉన్న ఫ్లై ఓవర్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై భారీగా వరద నీరు చేరింది. ప్రతి ఫ్లై ఓవర్‌పై వర్షం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వరద నీరు వెళ్లేలా ప్రతి 20 అడుగులకు ఓ రద్రం, కిందికి ఓ పైపును అమర్చుతారు. ఎంత భారీ వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని నిర్వహణ లేకపోవడంతో చెత్త, ప్లాస్టిక్ కాగితాలతో నిండి పోయాయి. దాదాపుగా అన్ని రంద్రాలు నిండటంతో వరద నీరు కిందికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో భారీ వర్షానికి ఫ్లై ఓవర్‌పై దాదాపు మూడు అడుగుల లోతు నీరు చేరింది. రాకపోకలకు వీలు లేకుండా మారడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మోటార్లు కాలిపోవడంతో నీట మునిగిన అండర్ పాస్..
వరద నీటిని పరిగణలోకి తీసుకోకుండా సరైనా ప్లాన్ లేకుండా కొత్తగూడ జంక్షన్‌లో అండర్ పాస్‌ను ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినప్పుడు వరద నీటితో నిండి పోవడం, వాహనాల రాకపోకలు స్తంభించడం జరుగుతూనే ఉంది. దీంతో అధికారులు కరెంట్ మోటార్లు బిగించి వచ్చిన వరద వచ్చినట్లే బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం భారీ వర్షానికి వరద నీరు చేరింది. మోటార్లు కాలిపోవడంతో వరదను తొలగించే పరిస్థితి లేకపోవడంతో అండర్ పాస్ పూర్తిగా నిండిపోయింది. డీజిల్ ఇంజన్లతో రాత్రంతా వరద నీటిని తోడారు. వరద నీటి తొలగింపు పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

జంక్షన్ జామ్..
కొత్తగూడ జంక్షన్‌తో పాటు మియాపూర్ రోడ్డులో భారీగా వరద నీరు చేరింది. హర్ష టయోటా ముందు వరద పోటెత్తడంతో మియాపూర్ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శుక్రవారం రాత్రి హైడ్రా మాన్‌సూన్ టీం వరదను తొలగించే ప్రయత్నాలు చేసినా గంటల తరబడి వాహనదారులు వరదనీటిలోనే ఉన్నారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్, మాదాపూర్ వైపు, మాదాపూర్ నుంచి మియాపూర్ వైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.