వచ్చే ఎన్నికల్లోనూ మేమే గెలుస్తాం
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
రేవంతే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు
మంత్రి అవ్వాలనే ఆలోచన లేదు..పార్టీకే ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. మళ్లీ ఐదేళ్ల పాటు కాంగ్రెస్‌కు ఢోకా లేదని అన్నారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నారు.
ఆయనే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. నాయకత్వ మార్పు ప్రశ్నే రాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌గా నేను వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాం. ఆ ఎన్నికల్లో గెలుపును అధిష్టానానికి కానుకగా ఇవ్వాలనేది నా కోరిక..’అని మహేశ్‌గౌడ్ తెలిపారు. బుధవారం గాం«దీభవన్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
100 స్థానాల్లో విజయం సాధిస్తాం
‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. వారిలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చేసారి గెలిచేది కూడా మేమే. 100 స్థానాల్లో విజయం సాధిస్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేం మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. అక్కడ ఓడిపోతున్నట్టు తెలిసే బీఆర్‌ఎస్ మాపై నిందలు వేస్తోంది. ఈ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పక్షాన కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసింది.
కవిత ఒక్కరే మిస్సింగ్. ప్రచారానికి కేసీఆర్ ఎందుకు రాలేదో కేటీఆర్‌ను అడిగితే తెలుస్తుంది. ఆయన ప్రచారానికి రాకపోయినా ప్రముఖులు, ముఖ్యులతో ఫోన్లో మాట్లాడారనే సమాచారం మాకుంది. అయితే కేసీఆర్, బీఆర్‌ఎస్‌లను ప్రజలు మర్చిపోతున్నారు. నేను గతంలో చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండదు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా బిహార్‌లో మహాగఠ్ బంధన్ విజయం సా«ధిస్తుంది..’అని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో ‘స్థానిక’భేటీ
‘ఇక స్థానిక సంస్థలకు ఎన్నికలపై దృష్టి సారిస్తాం. హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలతో మరోమారు మాట్లాడతాం. భవిష్యత్ కార్యాచరణపై రెండు, మూడు రోజుల్లో సీఎంతో పాటు సీనియర్ నేతలతో సమావేశమవుతాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై హైకమాండ్ ఎప్పుడైనా ప్రకటన చేయవచ్చు.
నాకు మంత్రి అవ్వాలని, లేదా ఉప ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదు. పార్టీపై మక్కువ ఉన్న వ్యక్తిని. మంత్రి హోదా కంటే పీసీసీ అధ్యక్ష స్థానానికే ప్రాధాన్యతనిస్తా. ఏదైనా అధిష్టానం నిర్ణయం శిరోధార్యం..’అని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు.


