సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ఓటరు నాడి ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పక్షాల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచార పర్వాన్ని హోరెత్తించినప్పటికీ.. ఓటింగ్ శాతం పెరగలేదు. సాధారణ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా పోలింగ్ 50 శాతానికి మించలేదు. అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 14న తేలనుంది. మంగళవారం జరిగిన పోలింగ్‌పై ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ప్రముఖులు, సినీతారలు, ఉన్నత హోదాలోని అధికారులు మాత్రమే ఉదయం తమ ఓటుహక్కు వినియోగించున్నారు. ఆ తర్వాత సాయంత్రం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. సామాన్య ఓటర్లు పెద్దగా గడప దాటలేదు. చివరి గంటలో మాత్రం పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సందడి పెరిగింది. మొత్తమ్మీద ప్రతి రెండు గంటలకు పది శాతం చొప్పున పోలింగ్ నమోదవుతూ వచ్చింది.
ఆదిలోనే సాంకేతిక సమస్య
పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సుమారు 9 నుంచి 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు సాంకేతిక సమస్య ఏర్పడింది. తొమ్మిది చోట్ల పాత ఈవీఎంలను మార్చి కొత్తవి ఏర్పాటు చేశారు. దీంతో ఉదయమే ఓటు వేసేందుకు వెళ్లిన ఉద్యోగులు, పనులకు ఇతరులు ఇబ్బందుల పాలయ్యారు. రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లు కొరత కారణంగా దివ్యాంగ ఓటర్లు అవస్థలుపడ్డారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలు దూరం ఉండటంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు.
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు అడుగడుగునా చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఆ తర్వాత అరగంట నుంచే ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో యథేచ్ఛగా సంచరించారు. కొందరైతే పోలింగ్ బూత్‌ల ముందే తిష్ట వేశారు. ఓ ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ ముందు నిలబడి తమ పార్టీ అభ్యర్ధి ఫొటో చూపిస్తూ ఓటు వేయాలంటూ కోరారు. కొంతమంది అమాత్యులు సైతం నియోజకవర్గంలో పర్యటించడం, వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొట్టాయి. మధ్యాహ్నం 2 నుంచి అధికార, ప్రతిపక్ష పారీ్టలకు చెందిన నేతలంతా నియోజకవర్గంలో దిగిపోయారు. నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని నేతలంతా ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచే నియోజకవర్గాన్ని వీడాల్సి ఉంది.
కొందరు మంత్రులు మాత్రం సోమవారం రాత్రి కూడా నియోజకవర్గంలో తిరిగారు. మంగళవారం ఉదయం నుంచే ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేకుండా రెండు ప్రధాన పారీ్టలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యథేచ్ఛగా బూత్‌ల వద్ద సంచరించారు. ఓ పార్టీ కార్యకర్తలు తమ టేబుల్ వద్ద పార్టీ జెండాతో పాటు కరపత్రాలను పంపిణీ చేశారు. ఓ అభ్యర్థి బైక్ ర్యాలీ నిర్వహించారు. యూసుఫ్‌గూడ, షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగింది. బోరబండలో కార్పొరేటర్ బాబాఫసీయుద్దీన్ అధికార పారీ్టకి ఓటు వేయాల్సిందిగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతుండగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర గొడవ జరిగింది. షేక్‌పేటలో ఎంఐఎం కార్యకర్తలు, నేతలు పోలింగ్ బూత్‌ల వద్ద తిష్టవేసి ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది చోద్యం చూసింది. అధికార పారీ్టకి చెందిన ఓ ఎమ్మెల్సీ డబ్బులు పంచుతూ కాలర్ ఎగరవేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.
వెబ్ కాస్టింగ్ పరిశీలన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ, పీఆర్‌ఓ యాప్ ఇన్ ఈసీఐ నెట్ కంట్రోల్ కేంద్రాన్ని సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. కంట్రోల్ రూం పనితీరును కర్ణన్ వివరించారు.కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పీఆర్‌ఓ యాప్ ఇన్ ఈసీఐ నెట్ లో ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలైన ఓట్లను ప్రిసైడింగ్ అధికారులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు.


