డీసీసీ ఇచ్చినా రెండు పదవుల కిందికి రాదు
మంత్రుల మధ్య వివాదం ముగిసిన అధ్యాయం
పార్టీ లైన్ దాటితే హైకమాండ్ నిఘాలో ఉంటారు
కేసీఆర్‌ను ఉద్యమ నేతగా గౌరవిస్తాం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు
ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఈ నెలాఖరు నాటికి పూర్తికావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాల్లో నిక్కచి్చగా ఉండదు. పార్టీలో రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. కానీ, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉంది.
డీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కూడా దరఖాస్తు చేసుకున్నారన్న విషయం నాకు తెలియదు. ఎమ్మెల్యేలకు డీసీసీ అనేది పదవి కిందకు రాదు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ల చైర్మన్లను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు డీసీసీ బరిలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో పాత వారికే అవకాశాలు ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. నాలుగైదు జిల్లాలకు కొత్త డీసీసీలు వస్తారు. వారం పదిరోజుల్లో డీసీసీలను ప్రకటించే అవకాశం ఉంది’అని వివరించారు.
మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం
రాష్ట్రంలో మంత్రుల మధ్య చోటుచేసుకున్న వివాదం ముగిసిన అధ్యాయమని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ అంశంపై అధిష్టానానికి వివరణ ఇచి్చనట్టు తెలిపారు. ఎంతటివారైనా పార్టీకి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. గీత దాటితే తనతోసహా ఎవరైనా అధిష్టానం నిఘాలో ఉంటారని పేర్కొన్నారు. గోడలకు కూడా చెవులుంటాయనే విషయాన్ని గ్రహించి నేతలు జాగ్రత్తగా మాట్లాలని హితవు పలికారు.
‘మంత్రుల మధ్య విభేదాలపై అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డిని అడిగారో లేదో నాకు తెలియదు. నన్ను మాత్రం అడిగారు. ఆ పంచాయితీ ముగిసిన అధ్యాయం. కొండా సురేఖ కూతురు అలా మాట్లాడాల్సింది కాదు. ఆమె పార్టీ వ్యక్తి కాదు. ఈ అంశంపై కొండా సురేఖను పిలిచి మాట్టాడి మందలించాం. మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, అడ్లూరి లక్ష్మణ్‌గౌడ్‌లు స్నేహితులు. కానీ, వారి మధ్య తలెత్తిన వివాదంతో బయట రాంగ్ మెస్సేజ్ వెళ్లింది.
నాతో సహా ఎవరికైనా పార్టీనే సుప్రీం. పార్టీ నియమావళికి లోబడి పనిచేయాల్సిందే’అని స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు ఇద్దరు భార్యలున్నారనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు. అది వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు.
ఓట్‌చోరీకి హైదరాబాద్‌లోనే బీజం..
బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల ఓట్లు తొలగించారని మహేశ్‌కుమార్ ఆరోపించారు. ఓట్ చోరీకి మొదట హైదరాబాద్‌లోనే బీజం పడిందని అన్నారు. కులం మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ను తాను గౌరవిస్తానని చెప్పారు. ‘ఉద్యమంలో ఆయన ముందుండి పోరాటం చేశారు. కానీ, ఆయన పదేళ్ల పరిపాలన గాడి తప్పింది.
కల్వకుంట్ల కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం. ప్రజా క్షేత్రంలో పాదయాత్రలు మంచిదే. ఆమె మొత్తం వాస్తవాలు మాట్లాడినప్పుడు గౌరవిస్తాం’అని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి సహకారం లేదని తెలిపారు. మెట్రో, మూసీ ప్రక్షాళన విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.


