
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులతో ముందుకు వచ్చే సింగపూర్ కంపెనీల కోసం ప్రత్యేక జోన్ లేదా ‘సింగపూర్ హబ్’ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రతిపాదించారు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే వందల ఏళ్లుగా హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతూ వస్తోందన్నారు. భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ సిమోన్ వాంగ్ మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వివిధ దేశాలతోపాటు ఇతర రాష్ట్రాలు తెలంగాణలో తమ కంపెనీలు ఏర్పాటు చేసి దీర్ఘకాలంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. టీఎస్–ఐపాస్ వంటి వినూత్న పారిశ్రామిక విధానాలతోపాటు అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించగలిగామన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, వస్త్ర పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. సమావేశం తర్వాత సిమోన్ వాంగ్, చెన్నైలోని సింగపూర్ కౌన్సిల్ జనరల్ పొంగ్, కాకి టియన్‌లను మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు.
నూతన రంగాల్లో పెట్టుబడులకు అవకాశం: సిమోన్ వాంగ్
తెలంగాణలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సింగపూర్ కంపెనీలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని అవకాశాలను పరిచేయం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సింగపూర్ హైకమిషనర్ సిమోన్ వాంగ్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన డీబీఎస్ వంటి కంపెనీలు ఇక్కడి పెట్టుబడుల అనుకూల వాతావరణంపై తమకు సమాచారం ఇచ్చాయన్నారు. ఐటీ, ఆవిష్కరణలు, ఐటీ అనుబంధ రంగాలకు చెందిన బ్లాక్‌చైన్ వంటి నూతన సాంకేతికతపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ వాతావరణం, ఆవిష్కరణలకు అనేక సానుకూలతలు ఉన్నాయని, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు చొరవచూపుతున్న విషయాన్ని సిమోన్ వాంగ్ గుర్తుచేశారు. సింగపూర్ పెట్టుబడుల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వాంగ్ స్వాగతించారు.
సింగపూర్‌తో బంధాలు బలోపేతమవ్వాలి: గవర్నర్
వివిధ రంగాల్లో సింగపూర్‌తో బంధాలు బలోపేతమవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. మంగళవారం సింగపూర్ హైకమిషనర్ హెచ్.ఈ.సైమన్ వాంగ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై తమిళిసైతో చర్చించారు.