
‘బుట్టబొమ్మ’ను వదల్లేనని భార్యతో చెప్పిన డాక్టర్ సృజన్
క్షణికావేశానికిలోనై ఉరివేసుకున్న డాక్టర్ ప్రత్యూష
సృజన్, బానోతు శ్రుతితో పాటు అత్తామామల అరెస్ట్
హైదరాబాద్: ‘ఇన్‌స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్‌తోపాటు ఇన్‌స్టా రీల్స్‌గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్‌కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్‌పర్తిలోని కాకతీయ వెంటెజ్‌లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్‌లు కూడా ఇక్కడే ఉంటున్నారు.
బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు..
ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్‌స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.