పేదలకు గూడు లేదు.. నీకు ప్రగతి భవనా?

Union Minister Kishan Reddy Is Angry With CM KCR - Sakshi

సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

ఎన్ని ఇళ్లు కట్టించినా నిధులిచ్చేందుకు మేం సిద్ధం

రాష్ట్రంలో మాఫియా రాజ్యం

ఫాంహౌస్‌ సీఎం అన్నందుకు సెక్రటేరియటే లేకుండా చేశారు

ముగిసిన ప్రజా ఆశీర్వాద యాత్ర..

ఘట్‌కేసర్‌/ఉప్పల్‌/యాదాద్రి/అంబర్‌పేట: ‘పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా నువ్వొక్కడివి ప్రగతి భవన్‌ కట్టుకుంటే సరిపోతుందా’ అని సీఎం కేసీఆర్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్ర«శ్నించారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లోని నాంపల్లిలో ముగిసింది. అంతకు ముందు యాత్రలో భాగంగా భువనగిరి, ఘట్‌కేసర్‌లో, ఉప్పల్, అంబర్‌పేటలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్లు కట్టించేందుకు ప్రధాని మోదీ ముందుకు వస్తున్నా.. సీఎం కేసీఆర్‌ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించినా.. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.

మోదీ ఏ ఒక్క రోజు సెలవు లేకుండా నిరంతరం పని చేస్తుంటే కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. రెండు, మూడేళ్ల తర్వాత కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవిలో ఉండరని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రతి పేదకూ కోవిడ్‌ టీకా అందజేస్తున్నామని, అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునే వరకు నిద్రపోమన్నారు. దేశంలో ఎరువుల కోసం కేంద్రం రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం రేషన్‌ దుకాణాల ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్న ఐదు కిలోల బియ్యం దీపావళి వరకు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు.

టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం... 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు గెలిచి చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరారని, కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే గెలిచిన వారంతా తెలంగాణ భవన్‌కే వెళ్తారని పేర్కొన్నారు. దేశంలోనే మొదటి సిమెంట్‌ కాంక్రీట్‌ జాతీయ రహదారి వరంగల్‌ వరకు నిర్మించిన ఘనత మోదీ సర్కార్‌దేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భువనగిరి ఖిలాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అయితే కోట అభివృద్ధికి రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు.  

మాఫియా రాజ్యం.. 
రాష్ట్రంలో ఇసుక మాఫియా, ల్యాండ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపిస్తే.. అసలు సెక్రటేరియటే కనిపించకుండా నేలమట్టం చేశాడన్నారు. బంగారు తెలంగాణ అందిస్తామన్న కేసీఆర్‌.. రాష్ట్రాన్ని ఓవైసీలకు దాసోహం చేశారని విమర్శించారు. 8 రాష్ట్రాల అభివృద్ధిని తన భుజస్కందాలపై మోదీ ఉంచారని, తెలుగువారు గర్వపడేలా నిజాయితీతో సేవ చేస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  

ఆ ఆప్యాయత వెంటాడుతోంది... 
అంబర్‌పేట ప్రజల కష్టార్జీతంతోనే.. వారి ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని కిషన్‌రెడ్డి అన్నారు. అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్తీల్లో చిన్నారులు, పెద్దల పలకరింపులు, ఆప్యాయత తనను వెంటాడుతూనే ఉన్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకొని కాసేపు మాట్లాడలేకపోయారు. అంబర్‌పేట ప్రజలను తన చివరి శ్వాస ఉన్నంత వరకూ గుర్తు పెట్టుకుంటానన్నారు. దేశానికి కేంద్ర కేబినెట్‌ మంత్రినే అయినా తాను అంబర్‌పేట బిడ్డనే అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానన్నారు. ఈ యాత్రలో ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జీ ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

జనవరి 1నుంచి పర్యాటక కేంద్రాల పునరుద్ధరణ.. 
కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జనవరి 1నుంచి దేశవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను పునరుద్ధరించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టూరిజం సెంటర్లు, పురాతన కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలను అభివృద్ధి చేసి దేశంలోని ప్రతి కుటుంబం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రతి రాష్ట్రంలో సంప్రదాయ పండుగలను గుర్తించడంతో పాటు చిత్రీకరించి దేశ, విదేశాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. రామప్పవంటి యునెస్కో గుర్తించిన 40 చారిత్రక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.  

యాదాద్రీశుడి సేవలో కేంద్ర మంత్రి  
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఉదయం 6.45 గం.కు బాలాలయానికి చేరుకొని సువర్ణ పుష్పార్చన చేశారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు మంత్రికి ఆచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈఓ గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top