బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు.. | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు..

Published Wed, Sep 20 2023 2:14 AM

Unable to pay the bill the child was left in the hospital - Sakshi

సైదాబాద్‌(హైదరాబాద్‌): వైద్యానికైన బిల్లు చెల్లించేస్తోమత లేక నిరుపేద దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. ఐదురోజులుగా ఎంత ప్రయత్నించినా ఆదుకునేనాథుడులేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్‌ ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సింగరేణి కాలనీలో నివసించే నితిన్, ప్రవల్లిక ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. నితిన్‌ కిరాయి ఆటో నడుపుతూ భార్యను పోషిస్తున్నాడు.

13 రోజుల క్రితం వారికి కూతురు జన్మించింది. అయితే పసిపాపకు ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒవైసీ ఆసుపత్రిలో చేర్చారు. ఏడురోజుల చికిత్స అనంతరం చిన్నారి కోలుకుంది. వైద్యానికిగాను రూ.లక్షా 16 వేల బిల్లు అయింది. అయితే వారి వద్ద కేవలం రూ. 35 వేలు మాత్రమే ఉన్నాయి.

మిగిలిన డబ్బులు కట్టడానికి సహాయం కోసం ఎవరిని అడిగినా ఫలితం లేకపోయింది. దాంతో బిల్లు కట్టలేక ఆ దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. గత ఐదు రోజులుగా తమను ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సేవాలాల్‌ బంజారా సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు కొర్ర మోతీలాల్‌ నాయక్‌ మాట్లాడుతూ దాతలు ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ఆసుపత్రి బిల్లు కట్టేందుకు సాయం చేయాలని కోరారు. 

Advertisement
Advertisement