సెల్లార్‌లో తెల్లారిన బతుకులు

Two Workers Killed In Wall Collapse In Manikonda - Sakshi

సెల్లార్‌లో పనిచేస్తుండగా మట్టి కూలి ఇద్దరు మృతి

పుప్పాలగూడలో ఘటన

మణికొండ: నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్‌ గుంతలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపై మట్టి కూలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈఐపీఎల్‌ 10 ఎకరాల్లో 14 అంతస్తుల గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మాణం చేప ట్టింది. అందులో భాగంగా పుప్పాలగూడ గ్రామం వైపు వెళ్లే రోడ్డు పక్కన సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మిస్తోంది.

శనివారం అందులో 8 మంది కూలీలు దిగి సెంట్రింగ్‌ పనులు చేస్తుండగా సాయంత్రం పక్కన ఉన్న మట్టి ఒక్కసారిగా ఇద్దరిపై కూలింది. మిగిలిన వారు తప్పించు కున్నారు. మృతి చెందిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్‌ (40), వెంకటర మణ(42)గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

వీరు కొద్దిరోజుల క్రితమే పనిలో చేరినట్టు తోటి కూలీలు పేర్కొన్నారు. వెంకటరమణ వద్ద జగద్గిరి గుట్ట చిరునామా తో ఉన్న ద్విచక్రవాహన ఆర్‌సీ లభించింది. పుప్పాలగూడలో అపార్ట్‌ మెంట్‌ సెల్లార్‌ గుంతలో మట్టి కూలిన విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక పనుల్లో పాల్గొన్నారు. గంటన్నర వ్యవధిలోనే ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.

పనులు ఆపాలని నోటీసు
ప్రస్తుతం వర్షాకాలం రావటంతో సెల్లార్‌ల పనులను నిలిపివేయాలని మణికొండ మున్సిపాలిటీ అధికారులు ఈఐపీఎల్‌ సంస్థకు ఇటీవలే నోటీసు జారీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని భవనాల తోపాటు దీనికీ జారీ చేశామని, అయినా పనులను కొనసాగించటంతోనే అనర్థం జరిగిందని మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి రాకేశ్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top