
మేడ్చల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థినితో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ అనూష (20) ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి ఘనాపూర్‌లోని మెడిసిటీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటుంది.
కాగా మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్‌రెడ్డితో కలిసి మేడ్చల్ నుండి నగరం వైపు ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆక్సిజన్ పార్క్ సమీపంలో వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కిందపడిపోగా అనూష శరీరంపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్‌రెడ్డిని మేడ్చల్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.