హుస్సేన్‌సాగర్‌లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య | mother and daughter incident in Hussain Sagar | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

Nov 5 2025 7:34 AM | Updated on Nov 5 2025 9:44 AM

mother and daughter incident in Hussain Sagar

హైదరాబాద్‌: కుటుంబ కలహాలతో రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి ఓ తల్లి హుస్సేన్‌ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లేక్‌పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పాతబస్తీకి చెందిన పృథ్వీ, కార్తీక అగర్వాల్‌ దంపతులు. పృథ్వీ వ్యాపారి కాగా..కార్తీక అగర్వాల్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌. వీరికి రెండున్నర సంవత్సరాల కుమార్తె బియారా ఉంది. ఏడాది క్రితం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు రావడంతో కార్తీక బహుదూర్‌పురాలోని పుట్టింట్లో ఉంటుంది. 

ఈ నెల 2వ తేదీన ఉదయం కార్తీక ఎవరికీ చెప్పకుండా తన కుమార్తెతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు బహుదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సోమవారం సాయంత్రం హుస్సేన్‌సాగర్‌లో ఓ మహిళ మృతదేహం తేలడంతో పోలీసులు వెలికితీసి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు.

 ఈ క్రమంలో విచారణ జరిపి అది కార్తీక అగర్వాల్‌ మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కార్తీక అగర్వాల్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెతో పాటు రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉందని తెలిపారు. దీంతో పోలీసులు మరోమారు మంగళవారం హుస్సేన్‌ సాగర్‌లో గాలించగా చిన్నారి మృతదేహం కూడా సాగర్‌ జలాల్లో కనిపించింది. కేసును బహుదూర్‌పూరా పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేస్తామని లేక్‌పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement