గత తొమ్మిది నెలల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 7,333 రోడ్డు ప్రమాదాలు
2702 మంది మృత్యువాత.. క్షతగాత్రులు 8,118 మంది..
సగటున ప్రతీ కిలోమీటరుకో ప్రమాదం
అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ ప్రధాన కారణాలుగా గుర్తించిన రాష్ట్ర రోడ్డు భద్రత అధికారులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిర్మితమైన విశాలమైన రోడ్లు ఉన్న చోట అతివేగం.. హైవేలలో ఇరుకైన ప్రాంతాలు.. ప్రమాదకరమైన మలుపులు.. డ్రైవర్ల నిర్లక్ష్యం..ఇతరత్రా కారణాలు వెరసి ప్రమాదం జరిగితే పెద్ద సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.
రాష్ట్ర పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో కొన్నిసార్లు నెత్తురు పారుతోంది. తాజాగా హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం..అతడి ప్రాణాలతోపాటు మరో 18 మందిని ప్రాణాలు తీసింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ ప్రమాదాలు పెరిగాయి.

జనవరి నుంచి సెప్టెంబర్ వరకు..
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 7,333 రోడ్డు ప్రమాదాలు జరగగా, 2,702 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,118 మంది క్షతగాత్రులయ్యారు. రాష్టవ్యాప్తంగా 6,417 కిలోమీటర్ల పొడవున జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. అయితే ప్రతీ కిలోమీటర్‌కు సగటున ఒక్కో రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్టు రాష్ట్ర పోలీస్ శాఖలోని రోడ్డు భద్రతా విభాగ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ రహదారులపై ఇరుకైన మలుపులు, ధ్వంసమైన రోడ్లు ఇలా ప్రమాదాలకు అనేక అంశాలు కారణమవుతున్నాయి.
వీటికి తోడు డ్రైవర్ల నిర్లక్ష్యం ఎదుటి వారికి యమపాశమవుతోంది. జాతీయ రహదారులపై వెళ్లే భారీ వాహనాల డ్రైవర్లు సైతం కనీస రోడ్డు భద్రత నియమాలు పాటించని పరిస్థితులు ఉంటున్నాయి. హైవేలపై ఓవర్ స్పీడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్‌తోపాటు కొన్నిచోట్ల సైన్‌బోర్డులు, స్టాపేజ్ సిగ్నళ్లు, సైడ్ రెయిలింగ్స్ సరిగ్గా లేకపోవడమూ ప్రమాదాలకు కారణంగా రోడ్డు భద్రత నిపుణులు పేర్కొంటున్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
రాష్ట్రంలో ఏటా వివిధ సంఘటనల్లో హత్యలకు గురయ్యేవారి సంఖ్య కన్నా పదిరెట్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఉంటోంది. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణ అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఏదో ఒక వాహన డ్రైవర్ చేసే తప్పుకు ఎంతోమంది అమాయకుల జీవితాలు బలవుతున్నాయి. అందుకే రోడ్డు ప్రమాదాల నియంత్రణను అత్యంత ప్రాధాన్యత అంశంగా పోలీస్‌శాఖ భావిస్తోంది. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కలి్పంచేందుకు ‘అరైవ్..అలైవ్’పేరిట రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం వచ్చే డిసెంబర్ నెలలో 15 రోజులపాటు నిర్వహించనున్నాం. – సాక్షి’తో డీజీపీ శివధర్‌రెడ్డి


