
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీలోగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చేనెల చివరి వరకు రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, మిగతావి ఆగస్టు తర్వాత వస్తాయని తెలిపారు. బోనస్ ప్రకటన తర్వాత రాష్ట్రంలో సన్న ధాన్యం సాగు పెరిగిందని చెప్పారు.
ఇతర దేశాల్లో డిమాండ్ ఉన్న ఆరు రకాల వరి రాష్ట్రంలో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయిల్‌పామ్ రైతులకు టన్నుకు రూ.25 వేలు తగ్గకుండా కనీస మద్దతు ధర కోసం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రానికి లేఖలు పంపించి, త్వరలోనే ప్రధానమంత్రిని కలుస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, అందులో తాను కూడా ఉన్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు చెపుతున్న మాటలన్నీ అబద్ధమని మంత్రి తుమ్మల అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ వేయడానికి 15 రోజుల ముందుగానే మేడిగడ్డ బరాజ్ మంజూరైందని తెలిపారు.