అక్రమాల పుట్ట.. మోసాల చిట్టా

TS HighCourt Bail Grants To Sandhya Convention MD Saranala Sridhar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోసాల చిట్టా బహిర్గతమవుతోంది. ఎంతోమందిని బెదిరింపులకు గురి చేసి.. ప్రాపర్టీలను కాజేసి.. అవినీతికి పాల్పడిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. చీటింగ్‌ కేసులో సంధ్య కన్వెన్షన్‌ ఎండీ సరనాల శ్రీధర్‌ రావును గురువారం రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు...  
►రాయదుర్గం పాన్‌ మక్తాలోని సంధ్య టెక్నో–1 లోని తొమ్మిదో అంతస్తులో రోవన్‌ కంపెనీ అసో సియేట్స్‌ ఎల్‌ఎల్‌పీ పేరిట 1,185 చదరపు అడుగుల కమర్షియల్‌ ప్రాపర్టీని రూ.60,39,500కు 2018లో కొనుగోలు చేశారు. రోవన్‌ కంపెనీ అసోసియేట్స్‌ డైరెక్టర్‌ చైతన్య కృష్ణమూర్తి మరో 12 మందికి గత మార్చిలో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ వచ్చిందని తెలియడంతో ఆఫీస్‌ ఏర్పాటు క్రమంలో పూజ చేసేందుకు వెళ్లగా పనులు పూర్తి కాలేదు. ఇదేమిటని సంధ్య కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ శ్రీధర్‌రావును అడగ్గా.. రెండు నెలలు ఆగండి పూర్తి చేసి ఇస్తానని నమ్మబలికి కాలయాపన చేశారు.  
►ఈ నేపథ్యంలో ఒకరోజు చైతన్య కృష్ణను తన ఆఫీస్‌కు పిలిచి తన ఆస్తులను ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు అటాచ్‌ చేశారని రెండేళ్ల వరకు ఏమీ చేయలేనని శ్రీధర్‌రావు చెప్పాడు. ఆఫీస్‌ కోసం ప్రాపర్టీ ఇవ్వాల్సిందేనని అడగ్గా.. మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండని బెదిరించాడు.  
►అదే అంతస్తులో 90 శాతం స్పేస్‌ను కొనుగోలు చేసిన ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ సంస్థ యజమాని ప్రవీణ్‌కుమార్, శ్రీధర్‌ రావు రోవన్‌ కంపెనీ అసొసియేట్స్‌కు అమ్మిన స్పేస్‌కు ఉన్న గోడలను పూర్తిగా కూల్చివేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు బుధ వారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. శ్రీధర్‌ రావు వద్ద ఎస్‌పీఏ తీసుకొని బెదిరింపులకు పాల్పడిన సృజన్‌సేన్, ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.ప్రవీణ్‌ కుమార్‌లను అరెస్ట్‌ చేయాల్సి ఉంది.  

రెండోసారి అరెస్టు.. 
ఐటీ కంపెనీ ఏర్పాటు కోసం సంధ్య టెక్నో–1లో ప్రాపర్టీ కొనుగోలు చేసి మోసపోయిన శ్రీనివాస్‌ హోసమానే ఫిర్యాదుతో ఈ నెల 10న రాయదుర్గం పోలీసులు శ్రీధర్‌ రావును అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై ఆయన బయటికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాయదుర్గం పోలీసులు శ్రీధర్‌రావును రెండుసార్లు అరెస్ట్‌ చేసినట్లయ్యింది. ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు ఆస్తులను అటాచ్‌ చేశారని చెబుతూ రెండేళ్ల వరకు రిపేర్‌ చేయలేనని చెప్పినట్లు బాధితుడు రోవన్‌ కంపెనీ అసోసియేట్స్‌ డైరెక్టర్‌ చైతన్య కృష్ణ మూర్తి తెలిపారు.. ఇచ్చిన డబ్బు వాపస్‌ తీసుకోవాలని బెదిరించారని ఆయన పేర్కొన్నారు.   

మూడో మోసం.. మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు 
►రాయదుర్గం పాన్‌ మక్తాలోని సంధ్య టెక్నో– 1 లో మోసాలు ఒక్కటోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు బాధితులు చేసిన ఫిర్యాదుతో శ్రీధర్‌ రావును అరెస్ట్‌ చేశారు. 
►తాజాగా అల్వాల్‌కు చెందిన ఓ డాక్టర్‌ తన భార్య స్నేహశ్రీ పేరిట 2363 చ.అడుగుల ప్రాపర్టీని రూ.88.61 లక్షలకు కొనుగోలు చేశారు. రిజిస్ట్రే షన్‌ చేసిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ అందజేశారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా ఎలాంటి ఎమినిటీస్‌ ప్రొవైడ్‌ చేయలేదు. ఇదేంటని అడిగితే మరో రూ.40 లక్షలు చెల్లిస్తే పనులు పూర్తి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహశ్రీ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. స్నేహశ్రీ సోదరి సైతం ఇదే తరహలో మోసపోయారని త్వరలోనే ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.   

గచ్చిబౌలి పీఎస్‌లో మూడు కేసులు  
►గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ ఎస్‌ఈజెడ్‌ పక్కన సంధ్య కన్వెన్షన్‌ను ఆనుకొని ఫర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లేఅవుట్‌లో న్యూ బోయినపల్లికి చెందిన దేవరాజ్‌ 708 చ.అ విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ నంబర్‌ 84ను మూడు దశాబ్దాల క్రితం కొనుగోలు చేశారు. ప్రస్తుతం చదరపు గజం ధర రూ.లక్షన్నరకుపైనే ఉంటుంది. అందులో ఓ గది కూడా ఉంది. ఆ ప్లాట్‌ను ఆనుకొని 150 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ను సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌ రావు కొనుగోలు చేశారు. పక్కప్లాట్‌లో బండరాళ్లు, మట్టి పోయడంతో బాధితుడు వెళ్లి అడగ్గా.. నీ ప్లాట్‌ ఎక్కడుందో సర్వే చేసి తీసుకో అని బెదిరించినట్లు బాధితుడు గచ్చిబౌ లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 
►ఇదే తరçహాలో గచ్చిబౌలిలోని  పలువురు ప్లాట్ల యజమానులను కట్టడి చేసి లేఅవుట్‌లో సగానికి పైగా ప్లాట్లను తక్కువ ధరకు  కొన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ప్లాట్లు గుర్తు పట్టని రీతిలో లేఅవుట్‌లో బండరాళ్లు మట్టితో నింపి, కొన్ని చోట్ల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. సరుకులు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదని కుషీచంద్, ఎర్త్‌వర్క్‌ చేయించుకొని రూ.3 కోట్లు ఇవ్వలేదని పి.విజయ్‌ ఫిర్యాదుతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. 

మొత్తం.. 14 ఎఫ్‌ఐఆర్‌లు.. 
శ్రీధర్‌ రావుపై ఇప్పటి వరకు 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. రాయదుర్గం పీఎస్‌లో మూడు, గచ్చిబౌలి పీఎస్‌లో మూడు, హైదరాబాద్‌ సీసీఎస్‌లో రెండు, జూబ్లీహిల్స్‌లో రెండు, నార్సింగి పీఎస్‌లో రెండు, మియాపూర్, మలక్‌పేట్‌ పీఎస్‌లో ఒక్కో ఎఫ్‌ఐఆర్‌ నమోదయినట్లు సమాచారం. శ్రీధర్‌రావు మోసాలకు గురైన బాధితులు వస్తే కేసులు నమోదు చేస్తామని   గచ్చిబౌలి పోలీసులు స్పష్టం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top