ఆఫీసు నుంచా.. ఇంటి నుంచా..! | TS Govt also wants information technology sector to be fully operational September | Sakshi
Sakshi News home page

ఆఫీసు నుంచా.. ఇంటి నుంచా..!

Jul 27 2021 12:41 AM | Updated on Jul 27 2021 12:41 AM

TS Govt also wants information technology sector to be fully operational September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆతిథ్య, రిటైల్‌ రంగాల తరహాలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం కూడా సెప్టెంబర్‌ నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడి న అనేక మందికి తిరిగి ఉపాధి దొరుకుతుందని భావిస్తోంది. కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ను కారణంగా చూపుతూ ఐటీ ఉద్యోగు లు ఆఫీసుల నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. మరోవైపు బడా ఐటీ కంపెనీలు వారానికి ఐదు రోజుల పని విధానం కాకుండా పరిమిత సంఖ్యలో కార్యాలయాలకు ఉద్యోగులు హాజరయ్యే హైబ్రిడ్‌ వర్క్‌ప్లేస్‌ (కొద్దిరోజులు ఇంటి నుంచి, మరికొద్ది రోజులు ఆఫీసు నుంచి పనిచేయడం) విధానంవైపు మొగ్గు చూపుతున్నాయి. కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన రవాణా, హౌస్‌ కీపింగ్, సెక్యూరిటీ తదితర ఉద్యోగులు మాత్రం ఐటీ ఆఫీసులు తిరిగి కళకళలాడే రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. 

10 శాతానికి మించని హాజరు 
కోవిడ్‌ మూలంగా ఏడాదిన్నరగా మూతపడిన హైదరాబాద్‌ ఐటీ కార్యాలయాల్లో సిబ్బంది హాజరు గత జూన్‌ నాటికి 60శాతానికి చేరుకుంటుందని ఐటీ వర్గాలు అంచనా వేశాయి. అది ఈ ఏడాది చివరి నాటికి 80శాతానికి పైనే ఉంటుందని సర్వే లు వెల్లడించాయి. అయితే గత ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్‌ రెండో దశ విజృంభించడంతో ప్రస్తుతం హైదరాబాద్‌ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల హాజరు పదిశాతంగా నమోద వుతోంది. థర్డ్‌వేవ్‌ భయంతోపాటు వ్యాక్సినేషన్‌ పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజ సంస్థలు 20 శాతం మంది ఉద్యోగులు బృందాల వారీగా ఆఫీసు నుంచి పనిచేసేలా ‘హైబ్రిడ్‌’విధానాన్ని తెరమీదకు తెస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో వంటి సంస్థలు వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నాయి.  

ఇతరుల సమస్యలనూ అర్థం చేసుకోండి
వ్యాక్సినేషన్‌ వేగం పెరగడంతోపాటు రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఐటీ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వి«ధానంతో ఆ రంగంపై ఆధారపడిన ట్యాక్సీ డ్రైవర్లు, క్యాంటీన్లు, హౌజ్‌ కీపింగ్, సెక్యూరిటీ, ఇతర సర్వీసు ప్రొవైడింగ్‌ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ రంగం కూడా సెప్టెంబర్‌ నుంచి పూర్తి సామర్థ్యం తో పనిచేయాలని కోరుకుంటున్నాం. వారిపై ఆధారపడిన ఇతర రంగాల వారి సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 
– జయేశ్‌ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ, పరిశ్రమల శాఖ 

డిసెంబర్‌ నాటికి మెరుగవుతుంది 
కోవిడ్‌ పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ ఐటీ రంగం మంచి పురోగతి సాధిస్తోంది. రాష్ట్రంలోని 1,500కు పైగా ఐటీ కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. 2020–21లో 13 శాతం వృద్ధిరేటుతో 1.45 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. వచ్చే ఏడాది కూడా రెండంకెల వృద్ధిరేటు సాధించడం ఖాయం. ఆఫీసు నుంచే పనిచేయాలని భారతీయ కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తుండగా, దిగ్గజ సంస్థలు హైబ్రిడ్‌ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. అందువల్ల డిసెంబర్‌ నాటికి ఆఫీసుకొచ్చే ఉద్యోగుల శాతం మెరుగవుతుందని అంచనా వేస్తున్నాం. 
–భరణికుమార్‌ ఆరోల్, ప్రెసిడెంట్, హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement