‘దేశ భవిష్యత్తు కోసం.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి’ | Sakshi
Sakshi News home page

‘దేశ భవిష్యత్తు కోసం.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి’

Published Sat, Sep 10 2022 1:34 AM

TRS District Presidents Urge CM KCR To Start National Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు. దేశంలో మోదీ సారథ్యంలోని రాక్షసపాలన అంతం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు ఏ విధంగానైతే అభివృద్ధి చేశారో, ఆ విధంగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న 21 మంది టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

కావాలి కేసీఆర్‌.. రావాలి కేసీఆర్‌
బీజేపీ ముక్త్‌ భారత్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని దేశ ప్రజలు భావిస్తున్నారని బాల్క సుమన్‌ చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వీర్యమై రాజకీయ శూన్యత ఏర్పడిందని, ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌తో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటవుతుందని అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలన లో దేశంలోని ఏ వర్గానికీ మేలు జరగడం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. రైతులు, యువత, మహి ళలు, దళిత, బలహీన వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా చూస్తున్నా రని చెప్పారు. కావాలి కేసీఆర్‌.. రావాలి కేసీఆర్‌ అని ప్రజలు అంటున్నారని తెలిపారు. దేశంలో ఫెడరల్‌ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని లింగయ్య యాదవ్‌ విమర్శించారు. జిల్లాల పార్టీ అధ్యక్షులే కాదని, అన్ని స్థాయిల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌ జాతీయ రాజకీ యాల్లోకి రావాలని కోరుతున్నారని తెలిపారు. 

తెలంగాణపై మోదీ సర్కారు కుట్ర
అమిత్‌ షా ఆగడాలకు అడ్డుకట్ట పడాలన్నా, మోదీ మెడలు వంచాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యమని మాలోత్‌ కవిత చెప్పారు. దేశ ప్రజలంతా ఆయన రాకకోసం ఎదురుచూస్తు న్నారని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ బ్రష్టు పట్టించారని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్‌ నాయకత్వం చాలా అవసరమని మాగంటి గోపీనాథ్‌ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పద్మాదేవేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సీఎం కేసీఆర్‌ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చింతా ప్రభాకర్‌ చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి రావాలని దాస్యం వినయ్‌ భాస్కర్‌ విజ్ఞప్తి చేశారు. ఒక విజన్‌ ఉన్న నాయకుడి కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని గువ్వల బాలరాజు  పేర్కొన్నారు. 

దేశానికి కేసీఆర్‌ అవసరం ఉంది
దేశానికి ప్రస్తుతం కేసీఆర్‌ అవసరం ఎంతో ఉందని, ఆయన దేశాన్ని పాలించాలని కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని సంపత్‌రెడ్డి అన్నారు. దేశాన్ని ఆవహించిన చీకటిని తొలగించే కాంతి రేఖ సీఎం కేసీఆర్‌ అని తాత మధు చెప్పారు. ఎంతో దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్‌ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని శంభీపూర్‌ రాజు అన్నారు. యావత్‌ దేశం కేసీఆర్‌ కోసం తెలంగాణ వైపు చూస్తున్నదని ఆరూరి రమేశ్‌ పేర్కొన్నారు. పీవీ తర్వాత దేశానికి మరోసారి ప్రధానమంత్రిని అందించాలని కరీంనగర్‌ ఎదురు చూస్తోందని, కేసీఆర్‌ దేశానికి దారి చూపాలని జీవీ రామకృష్ణారావు చెప్పారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ముజీబ్, తోట ఆగయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పాన్‌ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల!

Advertisement
Advertisement