ప్రధాని మోదీ పచ్చి మోసగాడు | TPCC Mahesh Kumar Goud Shocking Comments on PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ పచ్చి మోసగాడు

Apr 19 2026 5:28 AM | Updated on Apr 19 2026 5:28 AM

TPCC Mahesh Kumar Goud Shocking Comments on PM Modi

సోమవారం మహిళా బిల్లు పార్లమెంట్‌లో

పెడితే కాంగ్రెస్‌ మద్దతిస్తుంది: మహేశ్‌గౌడ్‌

మహిళా బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లుకు లింకేంటో తెలుసుకుని చంద్రబాబు మాట్లాడాలి 

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి మోసగాడని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు ముసుగులో దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేసే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదింపజేసుకోవాలని మోదీ కుట్ర చేశారని విమర్శించారు. మహిళా బిల్లు లోక్‌సభలో వీగిపోవడం మోదీ నాయకత్వానికి చెంప పెట్టు అని అన్నారు.

శనివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌.సంపత్‌కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావు తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ మహిళా బిల్లు విషయంలో బీజేపీ ప్రయత్నలోపం స్పష్టంగా కనబడిందని, తూతూమంత్రంగా బిల్లును సభ ముందుకు తెచ్చారని అన్నారు. ఆ నిందను ఇతరులపై మోపేందుకు మోదీ అండ్‌ టీం ప్రయత్నిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రత్యేకంగా మహిళా బిల్లును సోమవారం పార్లమెంటులో పెడితే కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని చెప్పారు.  

మోదీ, అమిత్‌ షాలను మోయడం చంద్రబాబుకు తగదు.. 
మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మహేశ్‌గౌడ్‌ తప్పుపట్టారు. ‘డీలిమిటేషన్‌ బిల్లుకు, మహిళా బిల్లుకు ఎందుకు లింకు పెట్టారో తెలుసుకుని చంద్రబాబు మాట్లాడితే బాగుంటుంది. కేవలం మోదీ, అమిత్‌షాలను మోయడమే పనిగా పెట్టుకోవడం ఆయనకు తగదు’అని హితవు పలికారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు కూడా సరైనవి కావని, ఆయన జై శ్రీరాం అనకుండా వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ప్రజల ఓట్లు అడుగుతారా అని సవాల్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement