భద్రాచలం నుంచి రేవంత్‌ యాత్ర!

TPCC Chief Revanth Reddy To Start Padayatra From Bhadrachalam - Sakshi

జనవరి 26 నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు పాదయాత్ర 

రాహుల్‌ తిరగని ప్రాంతాల మీదుగా రూట్‌మ్యాప్‌.. అధిష్టానానికి ఇప్పటికే అందజేత 

సాక్షి, హైదరాబాద్‌: ‘హాత్‌ సే హాత్‌ జోడో’యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ముగిసిన అనంతరం దానికి మద్దతుగా రాష్ట్రంలోని భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించనున్నారు. జనవరి 26న ప్రారంభం కానున్న ఈ యాత్ర జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు సాగుతుందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో భారీసభతో అది ముగుస్తుందని, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో ఎన్నికలకు వెళ్లిపోతుందని తెలుస్తోంది.  

సీతారామక్షేత్రంలోనే ఎందుకు? 
హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను భద్రాచలం లేదా జోగుళాంబ ఆలయం నుంచి ప్రారంభించాలని రేవంత్‌రెడ్డి భావించినా చివరకు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం వైపే మొగ్గుచూపారని తెలుస్తోంది. భద్రాద్రి ఆలయం నుంచి యాత్ర ప్రారంభిస్తే విజయం సిద్ధిస్తుందని, రాష్ట్రానికి ఈశాన్య దిక్కున ఉన్న ఈ ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభిస్తే సానుకూల ఫలితాలు వస్తాయనే ఆలోచనతో భద్రాచలాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.

కాంగ్రెస్‌ పార్టీకి పట్టున్న ప్రాంతంతోపాటు ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉండటం, స్థానికంగా పార్టీ ఎమ్మెల్యే ఉండటం, భద్రాచలం తర్వాత కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే ఉన్న ములుగు ప్రాంతం గుండా పార్టీ బలంగా ఉండే నర్సంపేట మీదుగా వెళ్లాలని, ఈ విధంగా యాత్రకు మొదట్లోనే మంచి ఊపు తీసుకురావడం రేవంత్‌ వ్యూహంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమయిందనే వాతావరణం కల్పించాలనేది రేవంత్‌ భావన అని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

అధిష్టానం నిర్ణయమేంటో?: వాస్తవానికి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ప్రతి రాష్ట్రంలో ఈ యాత్ర రెండు నెలలపాటు సాగనుంది. కానీ, తెలంగాణలో మాత్రం దాదాపు ఆరునెలల రూట్‌మ్యాప్‌ను రేవంత్‌రెడ్డి సిద్ధం చేసుకున్నారని, ఈ మేరకు దానిని అధిష్టానానికి ఇచ్చేశారని తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రమంతా పర్యటించేందుకు అనుమతినివ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం.

అయితే భారత్‌జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ పర్యటించిన ప్రాంతాలను మినహాయించి రూట్‌మ్యాప్‌ను రూపొందించారని తెలుస్తోంది. అధిష్టానం అనుమతి వస్తుందనే నమ్మకంతో రేవంత్‌ ఏర్పాట్లు చేసుకుంటుండగా, ఆయనతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కూడా అధిష్టానం జత చేస్తుందా? లేక రేవంత్‌ ఒంటరిగా యాత్ర చేసేందుకు అనుమతి లభిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే!    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top