Tomato Prices In Khammam: భయపెడుతోన్న టమాట ధరలు.. సామాన్యులు కొనగలరా?

Tomato Price Hike As Demand Increases Khammam - Sakshi

నెల క్రితం కిలో ధర రూ.10

ప్రస్తుతం రూ.58 పైనే..

ఖమ్మం వ్యవసాయం: ఏ కూరగాయలు లేకపోతే కనీసం టమాట అయినా వండొచ్చుగా.. సాధారణంగా ప్రతీ మధ్య తరగతి కుటుంబాల్లో వినిపించే మాట ఇది. కానీ, ఇప్పుడు టమాట కూడా సామాన్యులకు భారంగా మారింది. ధర పైపైకి వెళ్తుండటంతో కూర వండుకోవడం కాదు కదా.. వాటిని కొనాలంటేనే భయమేస్తోంది. ఒక్కోసారి రూపాయికి కిలో చొప్పున అమ్మినా కొనేవారు లేక.. రోడ్లపై పారబోసే టమాట ధర ఇప్పుడు భయపెడుతోంది. 

స్థానికంగా పంట ఉత్పత్తి లేకపోవడంతో..
టమాట ధర వినియోగదారులను ఠారెత్తిస్తోంది. స్థానికంగా పంట ఉత్పత్తి లేకపోవడంతో ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం రైతు బజార్లలో కిలో రూ.10కి లభించిన టమాట, నేడు రూ.58 పైగానే పలుకుతోంది. రిటైల్‌ మార్కెట్లు, వ్యాపార దుకాణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 నుంచి రూ.80 వరకు కూడా విక్రయిస్తున్నారు. యాసంగి పంటగా నవంబర్, డిసెంబర్‌ నెలల్లో సాగు చేసిన పంట ఏప్రిల్‌ నెలతో ముగిసింది. ఖమ్మం పరిసర మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో సాగు చేసిన టమాటను ఖమ్మం నగరంలోని హోల్‌సేల్‌ మార్కెట్‌లో, రైతుబజార్లలో విక్రయిస్తుంటారు.

ఏప్రిల్‌ వరకు స్థానికంగా పండిన టమాట పంట విక్రయానికి వచ్చింది. ప్రస్తుతం స్థానికంగా పంట ఉత్పత్తి లేదు. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారులు చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో షేడ్‌నెట్లలో టమాటను సాగు చేస్తున్నారు. స్థానికంగా పంట లేకపోవడంతో ధరకు రెక్కలొచ్చాయి. రైతు బజార్లలో ఏప్రిల్‌ 5వ తేదీ వరకు కిలో రూ.10కి లభించిన టమాట ఆ నెల చివరి వారానికి రూ. 34కు చేరింది. మే ఆరంభానికి రూ. 44కు చేరగా, ప్రస్తుతం రూ.58పైగా పలుకుతోంది. ధర పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు టమాట వినియోగానికి దూరమవుతున్నారు. ఈ ధరలు జూన్, జూలై వరకు ఉంటాయని ఉద్యాన అధికారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు, ఉద్యాన రైతులు పేర్కొంటున్నారు. 
చదవండి: అమెరికా టు కరీంనగర్‌.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో  దేశంలోనే రెండో బ్రాంచి

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top