కేంద్రం సూచనలతో.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో టోల్‌ట్యాక్స్‌ రద్దు 

Toll tax in Secunderabad Cantonment New Rule From November - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటోన్మెంట్‌లో టోల్‌ ట్యాక్స్‌ త్వరలోనే ముగియనుంది. కేంద్రం సూచనలతో టోల్‌ ట్యాక్స్‌ రద్దుకు కంటోన్మెంట్‌ బోర్డు తీర్మానం చేసింది. టోల్‌ట్యాక్స్‌ రద్దుతో కంటోన్మెంట్‌ బోర్డు రూ.10 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కోల్పోనుంది. అదే సమయంలో కంటోన్మెంట్‌ గుండా ప్రయాణం సాగించే కమర్షియల్‌ వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. అయితే టోల్‌ట్యాక్స్‌ రద్దుతో తాము కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో భర్తీ చేయాల్సిందిగా బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది.

పెండింగ్‌ సర్వీసు చార్జీల విడుదల, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లకు తోడుగా టోల్‌ట్యాక్స్‌ నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరనున్నారు. బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్‌ సోమశంకర్‌ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ అజిత్‌ రెడ్డి, సివిలియన్‌ నామినేటెడ్‌ మెంబర్‌ రామకృష్ణలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ సీఈఓ విజయ్‌ కుమార్‌ బాలన్‌ నాయర్‌లు పాల్గొన్నారు.  

ఆదాయ మార్గాలపై ఆసక్తికర చర్చ.. 
ఇప్పటికే ఆర్థిక లేమితో సతమతం అవుతున్న బోర్డు టోల్‌ట్యాక్స్‌ను సైతం రద్దు చేస్తే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు రామకృష్ణ ప్రతిపాదించారు. ఆరేళ్ల క్రితమే ఆక్ట్రాయ్‌ను రద్దు చేయగా, సంబంధిత పరిహారాన్ని జీఎస్‌టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతంలోనే టోల్‌ట్యాక్స్‌ను రద్దుచేయడంతో సంబంధిత రాష్ట్రాలే నష్టపరిహారాన్ని చెల్లించాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఏయే రాష్ట్రాలు కంటోన్మెంట్‌లకు నష్టపరిహారాన్ని ఇస్తున్నాయో వెల్లడించాలని ఎమ్మెల్యే సాయన్న కోరగా, అధ్యక్షుడు స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదన్నారు. 

ఆర్మీ సర్వీసు చార్జీలను సక్రమంగా చెల్లిస్తే బోర్డు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సాయన్న ప్రతిపాదించారు. నష్టపరిహారం చెల్లిస్తేనే టోల్‌ట్యాక్స్‌ రద్దు 
చేస్తామంటూ నెల రోజుల క్రితం బోర్డు తీర్మానం చేసి పంపినప్పటికీ, కేంద్రం  మరోసారి సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని అధ్యక్షుడు సోమశంకర్‌ అభిప్రాయపడ్డారు. 

సీఈఓ అజిత్‌ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంతో ఏకీభవించగా, సివిలియన్‌ నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ కూడా ఆమోదం తెలిపారు. టోల్‌ ట్యాక్స్‌ వసూళ్లను నిలిపివేతకు అంగీకారం తెలుపుతూనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరదాం అని తీర్మానించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వసూళ్లకు అక్టోబర్‌ 31 వరకు గడువు ఉండటంతో, అప్పటి వరకు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

టెండర్‌కు ఆమోదం 
టోల్‌ట్యాక్స్‌ వసూళ్ల నిలిపివేతకు బోర్డు తీర్మానం తీసుకున్న సమావేశంలోనే మరుసటి ఏడాది టెండర్లకు సంబంధించి, గతంలోనే జారీ చేసిన సర్క్యులర్‌ ఎజెండాకు బోర్డు ఆమోదం తెలపడం గమనార్హం. బోర్డు తాజా నిర్ణయంతో ఆ టెండర్ల ప్రక్రియపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వెల్లడించలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top