అడవిలో అడుగు పెట్టనివ్వం 

Tirbal Fight For Podu Land Cultivation In Khammam - Sakshi

సాక్షి, కొణిజర్ల/కారేపల్లి(ఖమ్మం): పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులపై అటవీ, పోలీసు అధికారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని..ఇకపై వారిని అడవిలో అడుగు పెట్టనివ్వబోమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, కారేపల్లి మండలం చీమలపాడులో శనివారం ‘పోడు రైతుల పొలికేక’నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ..అడవిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకే హరితహారం పేరుతో అటవీ భూములను పేదల నుంచి లాక్కుంటున్నారని మండిపడ్డారు.

పోడు సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీతో కాలయాపనే తప్ప సామాన్యుడికి ఒరిగేదేమీ లేదన్నారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ..పోడుసాగు చేసుకుంటున్న మహిళలు, చిన్నారులు..చివరకు ఎద్దులపై కూడా కేసులుపెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. పోడు రైతుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్‌ వరకు రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు వెల్లడించారు. పోడుసాగుదారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, టీజేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గోపగాని శంకర్‌రావు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, బాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. 

భారత్‌ బంద్‌కు మావోల మద్దతు
దుమ్ముగూడెం: ప్రతిపక్షాలు ఈనెల 27న పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రోడ్లను ధ్వంసం చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకుంది. జాగుర్‌గుండ దంతెవాడ రోడ్డు కమర్‌గూడ సమీపంలోని రహదారిని మావోయిస్టులు తవ్వేశారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే, దంతెవాడ–సుక్మా సరిహద్దులోని సామేలి గ్రామంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా 27న జరిగే బంద్‌కు తమ మద్దతు ఉంటుందంటూ మావోయిస్టులు పోస్టర్లు వేశారు.   

చదవండి: పాఠశాలలో కరోనా కలకలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top