Hyderabad: Three Held For Theft of Prefabricated Public Toilet At Malkajgiri - Sakshi
Sakshi News home page

Hyderabad: ప్రహారీకి అడ్డుగా ఉందని పక్కా ప్లాన్‌! జీహెచ్‌ఎంసీ పబ్లిక్‌ టాయిలెట్‌ కొట్టేసి..

Published Tue, Mar 22 2022 8:51 AM

Three Held For Theft of Prefabricated Public Toilet At Malkajgiri - Sakshi

సాక్షి, మల్కాజిగిరి: మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రజల ఉపయోగార్థం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన పబ్లిక్‌ టాయిలెట్‌ మాయమైంది. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేయగా, టాయిలెట్‌ చోరీ వెనుక ఉన్న అసలు కథ బయటకు వచ్చింది.  

రూ.45 వేలకు విక్రయం 
ఆనంద్‌బాగ్‌ చౌరస్తాలో కొన్నాళ్ల క్రితం ఇనుముతో చేసిన పబ్లిక్‌ టాయిలెట్‌ ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో ఓ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ భారీ మల్టీప్లెక్స్‌ నిర్మిస్తోంది. దీని ప్రహరీ నిర్మాణానికి సదరు టాయిలెట్‌ అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే దాన్ని తొలగించాలని కోరుతూ సదరు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పలుమార్లు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్‌ టాయిలెట్‌ను తొలగించాలంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండాలని వాళ్లు తేల్చి చెప్పారు.
చదవండి: డ్రెస్‌ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి..

నిర్మాణ సంస్థ సూపర్‌వైజర్‌ బిక్షపతికి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే అరుణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది.  ఆ పబ్లిక్‌ టాయిలెట్‌ తొలగించే పని తాను చేస్తానంటూ చెప్పడంతో బిక్షపతి అంగీకరించాడు. టాటా ఏస్‌ వాహనం డ్రైవర్‌ చేస్తూ ఫ్లెక్సీ హోర్డింగ్స్‌ పని చేసే జోగయ్యకు ఆ పని అప్పగించాడు.  ఈ నెల 16 ఆ టాయిలెట్‌ తీసుకెళ్లి ముషీరాబాద్‌లో రూ.45 వేలకు విక్రయించాడు. ఫిర్యాదు అందుకున్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ జి.రాజు ఆదేశాల మేరకు సానిటరీ సూపర్‌వైజర్‌ మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 17న కేసు నమోదైంది.

ప్రాథమిక ఆధారాలు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పబ్లిక్‌ టాయిలెట్‌ తరలించడానికి వినియోగించిన వాహనాన్ని గుర్తించి జోగయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. టాయిలెట్‌ తొలగింపునకు సంబంధించి బిక్షపతి, అరుణ్‌కుమార్‌ మధ్య ఒప్పందం కుదిరిందని, అరుణ్‌ చెప్పడంతోనే తాను దాన్ని తీసుకుపోయానని విషయం చెప్పడంతో జోగయ్యను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బిక్షపతి, అరుణ్‌ కోసం గాలిస్తున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement