Telangana: పదేళ్లలో తొలిసారి.. లాభాల కిక్‌తో 2023లోకి ఆర్టీసీ..

Telangana TSRTC Entering 2023 With Profits First Time In 10 Years - Sakshi

ప్రాఫిట్‌ చాలెంజ్‌ పేరుతో 3 వారాలుగా సరికొత్త కసరత్తు

లాభాల్లోకి 26 డిపోలు.. లాభాల దరికి మరో 20 డిపోలు

పదేళ్లలో తొలిసారి ఈ ఘనత సాధించిన సంస్థ

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు పదేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్‌ఆరీ్టసీ... కొత్త ఏడాదిలో నూతనోత్సాహంతో అడుగుపెడుతోంది. గతేడాది ఏకంగా 26 డిపోలను లాభాల్లో నిలపడంతోపాటు మిగతా డిపోల్లో నష్టాలను భారీగా తగ్గించుకొని 2022కు గుడ్‌బై చెప్పేసింది. జూలైలో డీజిల్‌ సెస్‌ను సవరించడం ద్వారా రోజువారీ టికెట్‌ ఆదాయాన్ని భారీగా పెంచుకున్న ఆర్టీసీ... గత మూడు వారాలుగా ప్రాఫిట్‌ చాలెంజ్‌ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పెద్ద ప్రభావాన్నే చూపింది. డీజిల్‌ సెస్‌ను పెంచాక నవంబర్‌ వరకు కొన్ని డిపోలే లాభాల్లోకి రాగా, ప్రాఫిట్‌ ఛాలెంజ్‌ ప్రారంభించాక వాటి సంఖ్య దాదాపు రెట్టింపైంది. 

ఏమిటీ చాలెంజ్‌..? 
గత కొన్ని నెలలుగా ఆరీ్టసీలో రకరకాల చాలెంజ్‌లు నిర్వహిస్తున్నారు. గత దసరా వేళ ఆదాయం మరింత పెరిగేలా సంస్థ యాజమాన్యం దసరా ఛాలెంజ్‌ను నిర్వహించింది. అలాగే రాఖీ పండుగ సందర్భంగా రాఖీ చాలెంజ్, శుభకార్యాలు అధికంగా ఉండి ప్రయాణాలు ఎక్కువగా ఉండే శ్రావణమాసంలో శ్రావణమాస చాలెంజ్‌ లాంటివి నిర్వహించింది. ఈ కొత్త ప్రయత్నాలకు తగ్గట్లుగానే వివిధ డిపోలకు అవే పండగలకు గతంలో వచ్చిన ఆదాయం కంటే ఈసారి ఎక్కువ ఆదాయం వచి్చంది. అలాగే 3 నెలలపాటు డిపోలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టేలా సంస్థ 100 రోజుల చాలెంజ్‌ నిర్వహించి గరిష్ట ఆదాయాన్ని పొందింది. వాటితో పోలిస్తే మరింత ప్రభావవంతంగా పనిచేసేలా.. డిపోల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తూ గత మూడు వారాలుగా ప్రాఫిట్‌ చాలెంజ్‌ను మేనేజ్‌మెంట్‌ విసిరింది. ఇది ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది. డీజిల్‌ సెస్‌ పెంచాక నవంబర్‌ వరకు 13 డిపోలు లాభాల్లోకి రాగా ప్రాఫిట్‌ చాలెంజ్‌ మొదలయ్యాక ఆ సంఖ్య ఏకంగా 26కు చేరుకుంది.  

ఏప్రిల్‌ వరకు కార్పొరేషన్‌  లాభాల్లోకి! 
ప్రాఫిట్‌ ఛాలెంజ్‌లో భాగంగా రోజువారీ టికెట్‌ ఆదాయం పెరిగేలా చేయడంతోపాటు ఖర్చులను తగ్గించాలి. ఇందుకు 15 అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌ ఆదేశించింది. వాటిని ఎలా నిర్వహించాలో డిపో మేనేజర్లకు శిక్షణ ఇవ్వగా వారు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. డిపోలను లాభాల్లోకి తెచ్చేందుకు సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఏప్రిల్‌ నాటికి సిటీలోని కొన్ని మినహా మిగతా డిపోలు లాభాల్లోకి వచ్చి మొత్తం కార్పొరేషన్‌ బ్రేక్‌ ఈవన్‌ స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం 26 డిపోలు లాభాల్లో ఉండగా మరో 10 డిపోల్లో రోజువారీ నష్టాలు రూ. లక్షలోపు ఉన్నాయి. ఇంకో పది డిపోల్లో నష్టాలు రూ. 2 లక్షల్లోపు ఉన్నాయి. వెరసి మరో 20 డిపోలు త్వరలోనే లాభాల్లోకి రానున్నాయి. అధిక నష్టాలు వచ్చే వాటిల్లో మొదటి 10 స్థానాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని డిపోలే ఉన్నాయి. వాటిని నియంత్రించగలిగితే కార్పొరేషన్‌ పరిస్థితి బాగా మెరుగుపడనుంది. 

లాభాల్లో ఉన్న డిపోలు ఇవే
ఇబ్రహీంపట్నం, జగిత్యాల, గోదావరిఖని, కరీంనగర్‌–1, వనపర్తి, సిద్దిపేట, వరంగల్‌–1, నల్లగొండ, యాదగిరిగుట్ట, హనుమకొండ, కోదాడ, జనగామ, మెదక్, వేములవాడ, సంగారెడ్డి, దేవరకొండ, భూపాలపల్లి, మణుగూరు, మహేశ్వరం, పరిగి, నర్సాపూర్, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి, హైదరాబాద్‌–2, హైదరాబాద్‌–1, పికెట్‌.
చదవండి: ఐటీ కారిడార్‌కు మరో మణిహారం.. కొత్త సంవత్సరం కానుకగా ఫ్లై ఓవర్‌..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top