Performance‌ Grading‌ Index‌: గ్రేడ్‌–2లో తెలంగాణ | Telangana Stand In Grade 2 In Performance Grading Index | Sakshi
Sakshi News home page

Performance‌ Grading‌ Index‌: గ్రేడ్‌–2లో తెలంగాణ

Jun 7 2021 4:53 AM | Updated on Jun 7 2021 4:54 AM

Telangana Stand In Grade 2 In Performance Grading Index - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలల నిర్వహణలో తెలంగాణ గ్రేడ్‌–2లో నిలిచింది. గత 2018–19 విద్యా సంవత్సరం కంటే 2019–20లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు.. పాఠశాలల నిర్వహణ.. పరిపాలన ఎలా ఉందన్న మూడు కేటగిరీల్లో 70 అంశాల ఆధారంగా కేంద్ర విద్యాశాఖ ప్రతి ఏటా రాష్ట్రాలకు పర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) పేరుతో ర్యాంకులను కేటాయిస్తోంది. మొత్తం 1,000 పాయింట్లలో ఏయే రాష్ట్రాలు ఎన్ని పాయింట్ల స్కోర్‌ను పొందాయనే అంశాల ఆధారంగా గ్రేడింగ్‌లను ఇస్తోంది. ఇందులో భాగంగా 2019–20 విద్యా సంవత్సరంలో వివిధ రాష్ట్రాల పీజీఐ స్కోర్‌లను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ఆదివారం విడుదల చేశారు. అందులో 951–1000 పీజీఐ స్కోర్‌ (లెవెల్‌–1) ఏ రాష్ట్రానికీ దక్కలేదు. తెలంగాణ 772 పాయింట్లతో గ్రేడ్‌–2లో నిలిచింది. 

టాప్‌ స్కోర్‌తో ఐదు రాష్ట్రాలు.. 
ఇక 901–950 పీజీఐ స్కోర్‌తో గ్రేడ్‌ 1++ (లెవెల్‌–2)ను ఐదు రాష్ట్రాలు దక్కించుకున్నాయి. అందులో అండమాన్‌ నికోబార్‌ దీవులు, చండీగఢ్, కేరళ, పంజాబ్, తమిళనాడు నిలిచాయి. తెలంగాణతోపాటు మరో ఏడు రాష్ట్రాలు 751–800 మధ్య స్కోర్‌తో గ్రేడ్‌–2 (లెవెల్‌–5) స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ 801–850 పీజీఐ స్కోర్‌తో గ్రేడ్‌–1ను (లెవెల్‌–4) సాధించింది. ఇక గ్రేడ్‌–5లో మేఘాలయ ఉండగా, చివరి గ్రేడ్‌–7లో లద్దాఖ్‌ ఉంది. 

స్కోర్‌ మెరుగు పరుచుకున్న తెలంగాణ 
పాఠశాల విద్యారంగంలో తెలంగాణ తన పీజీఐ స్కోర్‌ను కొంత మేరకు మెరుగు పరుచుకుంది. 2018–19లో 757 పాయింట్ల స్కోర్‌ను పొందగా, 2019–20లో తన స్కోర్‌ను 772 పాయింట్లకు పెంచుకుంది. 2019–20 సంవత్సరంలో తమ స్కోర్‌లను 0.1 నుంచి 5 శాతం వరకు 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు పెంచుకున్నాయి. అందులో తెలంగాణ కూడా ఉండటం విÔó షం. 

నాణ్యత ప్రమాణాలు, అభ్యసనలో 12వ స్థానం 
పాఠశాల విద్యలో నాణ్యత ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాల్లో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. ఇందులో 180 పాయింట్లకుగాను అత్యధికంగా 168 పాయింట్లతో రాజస్తాన్‌ మొదటి స్థానంలో నిలవగా, 100 పాయింట్లతో అరుణాచల్‌ ప్రదేశ్‌ చివరి స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 142 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. యాక్సెస్‌ విభాగంలో మొత్తం 80 పాయింట్లకుగాను 69 పాయింట్లు సాధించింది. అదే 2018–19లో ఈ విభాగంలో 66 పాయింట్లే రాగా, ఇపుడు మూడు పాయింట్లను పెంచుకుంది.


మౌలిక సదుపాయాల్లోనూ మెరుగు.. 
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు. వసతుల కల్పన విభాగంలో తెలంగాణ తన స్కోరును మెరుగుపరుచుకుంది. 2019–20లో మొత్తం 150 పాయింట్లకుగాను రాష్ట్రం 113 స్కోరు సాధించింది. అదే 2018–19లో 92 పాయింట్లే ఉన్నాయి. ఇక ఈక్విటీ కేటగిరీలో 230 పాయింట్లకుగాను 210 పాయింట్లను పొందింది. గవర్నెన్స్‌ ప్రాసెస్‌ విభాగంలో 360 పాయింట్లకు గాను రాష్ట్రం 238 పాయింట్లను సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement