బాయ్‌కాట్‌ నుంచి బాయికి..

Telangana: Singareni Workers On Duty From Today - Sakshi

మూడురోజుల సమ్మె ముగియడంతో నేటి నుంచి విధుల్లోకి సింగరేణి కార్మికులు

సాక్షి, హైదరాబాద్‌/మంచిర్యాల: సింగరేణి సమ్మె సక్సెస్‌ అయింది. కార్మికులు, కార్మిక సంఘాలు సంఘటితమై సింగరేణి వ్యాప్తంగా మూడురోజులపాటు కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయా లన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు గురువారం మొదలుపెట్టిన సమ్మె శనివారంరాత్రి షిఫ్టుతో ముగిసింది. సమ్మె వల్ల రోజుకు 1.5 లక్షల టన్నుల చొప్పున 4.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, రూ.120 కోట్ల ఆదాయానికి గండిపడిందని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.

ఈ లోటును పూడ్చుకుంటూ నిర్దేశిత రోజువారీ లక్ష్యాలను సాధించేందుకు కార్మికులు, అధికారు లు కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఆదివారం సెలవుదినం అయినప్పటికీ ఉపరితల గనుల నుంచి ఉత్పత్తి, రవాణాను కొనసాగించాలని నిర్ణయించింది. సెలవుదినానికి సంబంధించిన పని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తూ కార్మికులను విధులకు ఆహ్వానించింది. సెలవురోజు విధులకు అనుమతిస్తే రెండు మస్టర్ల జీతం లభిస్తుంది. అయితే సెలవు రోజు పనిచేయడానికి వారంలో కనీసం నాలుగు రోజులు విధులకు హాజరై ఉండాలి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల నిబంధనను యాజమాన్యం రెండురోజులకు సవరించింది. 

కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చలు..         
జేవీఆర్‌ ఓసీ–3, శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్‌–3, కేకే–6 ఇంక్లైన్‌ బొగ్గుబ్లాక్‌లను వేలం నుంచి తొలగించి, సింగరేణికే అప్పగించాలన్న కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్‌పై హైదరాబాద్‌లోని రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌ వద్ద శనివారం సాయంత్రం మరోసారి చర్చలు జరిగాయి. ఈ అంశం కేం ద్రం పరిధిలోనిదని, కేంద్రం విధానపర నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.

ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై సంబంధిత శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఇతర ప్రముఖులను కలసి నివేదిస్తామని కార్మిక సంఘాల జేఏసీ పేర్కొనగా, దానికి అవసరమైన సహకారం అందిస్తామని యాజమాన్యం పేర్కొంది. మిగతా డిమాండ్లను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్ర కార్మికశాఖ అధికారులు, రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌ సూచించగా, వచ్చే నెల 20న మరోసారి సమావేశం కావాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.  

సింగరేణి ప్రధాన కార్యాలయం ముట్టడి 
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్లసూరీళ్లు ముట్టడించారు. ఉద్యోగులు, అధికారులు ప్రధా న గేటు ముందు బైఠాయించారు. కార్యాలయ ఆవరణలో వంటావార్పు చేపట్టి అక్కడే భోజనాలు చేశారు.

దీంతో సిం గరేణి ప్రధాన కార్యాలయంలోని ఇతర కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ రద్దు డిమాండ్‌పై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే 2022 జనవరి 20 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని ఏఐటీ యూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top