భోగి వెలుగుల్లో ఊళ్లు కళకళ

Telangana Sankranthi Celebrations In Villages - Sakshi

పల్లెల్లో జోరుగా సంక్రాంతి సంబరాలు

గతేడాది గల్లంతైన సందడి ఈసారి ప్రత్యక్షం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన బీభత్సం, భయోత్పాతంతో గత సంక్రాంతిని సరిగా నిర్వహించుకోలేకపోయిన ప్రజలు ఈసారి సంప్రదాయబద్ధంగా, ఆహ్లాదంగా జరుపుకొంటున్నారు. ముఖ్యంగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం భోగి మంటల వెలుగులో ఊళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. కోవిడ్‌ మూడో వేవ్‌ ప్రారంభమైందన్న హెచ్చరికలతో కొంత కలవరం ఉన్నా, గతేడాది ఉన్న భయం ఈసారి అంతగా కనిపించటం లేదు.

ఇక కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో సంక్రాంతికి చాలా ముందుగానే పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఈసారి పండగకు ఐదారు రోజుల ముందే జనం ఊళ్లకు వెళ్లారు. ఫలితంగా ఊళ్లు కోలాహలంగా మారి కళకళలాడుతున్నాయి. కోవిడ్‌ రెండో వేవ్‌ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకుని గత ఆరు నెలలుగా సాధారణ జనజీవనం నెలకొంది.

పట్టణాల్లో వ్యాపారాలు సాఫీగా సాగాయి. మరోవైపు రెండేళ్లపాటు మంచి వర్షాలు కురవటంతో పంటలు బాగానే పండాయి. ఫలితంగా ఈసారి సంక్రాంతి జోష్‌ పెరిగింది. అయితే గతంలో మాదిరి పిండి వంటలు ఉమ్మడిగా చేయడం, ఇరుగు పొరుగువారు ఒక్కచోట చేరడం వంటి కాస్త తగ్గాయనే చెప్పాలి.

బస్సుల్లో సాధారణ రద్దీయే
సాధారణంగా పండగకు రెండు రోజుల ముందు బస్సులు కిటకిటలాడుతుంటాయి. కానీ ఈసారి సెలవులు ముందుగానే రావటం, గత వారం రోజులుగా జనం ఊరిబాట పట్టడంతో రెండు రోజులుగా బస్సుల్లో సాధారణ రద్దీనే ఉంది. ఆక్యుపెన్సీ రేషియో 59 శాతాన్ని దాటలేదు. రోజువారి టికెట్‌ ఆదాయం రూ.10 కోట్లలోనే ఉంది. కోవిడ్‌ భయంతో ఎక్కువ మంది బస్సుల కంటే సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top